19-02-2025 10:57:38 PM
వెల్లడించిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం..
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను దేశానికి రప్పిస్తామని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌ను ఉగ్రవాది అంటూ హసీనా ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హసీనా వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించింది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను దేశానికి రప్పించడమే తమ ప్రథమ లక్ష్యమని మహమ్మద్ యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం పేర్కొన్నారు.
హసీనాను న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సి ఉన్నందున ఆమెను తమకు అప్పగించాలని భారత్‌ను కోరుతున్నామని తెలిపిన షఫీకుల్ అందుకు సంబంధించిన ప్రయత్నాలను వేగవంతం చేసినట్లు తెలిపారు. గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో దేశం వీడిన షేక్ హసీనా అప్పటినుంచి భారత్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.