calender_icon.png 13 February, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గింది బీసీలా? ఓసీలా?

13-02-2025 12:00:00 AM

తెలంగాణ జనాభా 2011 లెక్కల ప్రకారం 3.51 కోట్లు. 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకా రం రాష్ట్ర జనాభా 3.63 కోట్లు. అంటే, మూడేళ్లలో దాదాపు 12 లక్షల జనాభా పెరిగింది. ఇదే సగటు తీసుకుంటే, రాష్ట్ర జనాభా 2014నుంచి 2024 కులగణన నాటికి 40 లక్షలు పెరగాలి. కానీ, 2024 కులగణన సర్వేలో 3.56 కోట్లమంది పాల్గొన్నారని, దాదాపు 16 లక్షల మంది (3.1 శాతం) పాల్గొన లేదని ప్రభుత్వం ప్రకటించింది.

అంటే, 2024 నాటి కి మొత్తం జనాభా 3.70 కోట్లు. 2014 సమగ్ర కుటుంబ సర్వే నుంచి 2024 కులగణన వరకు రాష్ట్రంలో పెరిగిన జనాభా 3.70 కోట్లు మైనస్- 3.63 కోట్లు = 7 లక్షలు మాత్రమేనా? ఓటర్ల జాబితాను ఈ సర్వేతో పోల్చడం సరికాదు. ఎందుకంటే, చాలామంది సెటిలర్స్ వారి స్వస్థలాలతోపాటు తెలంగాణలోని పలు నగరాల్లోకూడా ఓటరుగా నమోదై ఉంటారు.

కానీ, గత సంవత్సరం వరకు రాష్ట్రంలో జారీ అయిన ఆధార్ కార్డులు దాదాపు 3.80 కోట్లు. వీటికన్నా ఎక్కువే తెలంగాణ జనాభా ఉంటుంది. ఏడాదికి 1 శాతం జనాభా పెరిగినా 2011 నుంచి 2024 వరకు 13 ఏండ్లలో 45 లక్షల జనాభా పెరగాలి. ఈ లెక్కన రాష్ట్ర జనాభా దాదాపు నాలుగు కోట్ల వరకు ఉంటది. కానీ, 3.70 లక్షలని 2024 కులగణన పేర్కొంది.

ఇందులో 3.1 శాతం అంటే 16 లక్షలమంది సర్వేలో పాల్గొనలేదని చెప్పారు. కానీ, ఇక్కడ ప్రభుత్వ వర్గాలు ఒప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ సర్వేలో దాదాపు 10 శాతం మంది ప్రజల నుంచి వివరాలు సేకరించలేదు లేదా వారు సర్వేకు సహకరించలేదు అన్నది. మొత్తం అందరూ సర్వేలో పాల్గొంటే తెలంగాణ జనాభా దాదాపు 4 కోట్ల వరకు ఉండేది.

సర్వే చేయకుండానే సర్వేలో పాల్గొనని వారు అక్షరాల 16 లక్షల (దాదాపు జనాభాలో 3.1 శాతం) అని ప్రభుత్వం ఏ ప్రాతిపదికన చెప్పిందన్న సందేహాన్ని వివిధ రాజకీయ పార్టీలు, కులసంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. వారితోపాటు ప్రజలకుకూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది.

2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వేకు, 2024లో చేసిన కులగణనలో ఎస్సీ, ఎస్టీ జనాభా శాతంలో పెద్దగా మార్పు లేదు. కానీ ఓసి, బీసీ, సామాజిక వర్గాల్లో మార్పు ఎక్కువగా కనిపిస్తున్నది. 2014 ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా శాతం 51 శాతం ఉంటే, 2024 నాటికి దాదాపు 56 శాతానికి పెరిగింది.

అంటే దాదాపు 5 శాతం పెరుగుదల కనిపించింది. అదే విధంగా 2014లో ఓసి జనాభా 21 శాతం ఉండగా, 2024 నాటికి దాదాపు 16 శాతానికి తగ్గింది. ఇక్కడ 5 శాతం తగ్గుదల కనిపిస్తుంది. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో బీసీల జనాభా 5 శాతం పెరిగితే, ఓసీల జనాభా 5 శాతం తగ్గింది. 

నిజానిజాలు ప్రభుత్వమే వెల్లడించాలి

ఇక్కడే అసలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2014 సమగ్ర కుటుంబ సర్వేలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభాతోపాటు ముస్లిం మైనార్టీల జనాభాను కూడా తెలిపారు. కానీ, 2024 కులగణనలో తెలిపినట్టు ఓసీల్లో ఉన్న ముస్లిం మైనార్టీలను, బీసీల్లో ఉన్న ముస్లిం మైనార్టీల (బీసీ జనాభాను వేరుగా చేసి వివరించే ప్రయత్నం చేయలేదు. దీనితోనే అసలు సమస్య మొదలైంది.

బీసీ సంఘా ల నేతలు ఓసీల జనాభా 21 శాతం కాబట్టి, ఇందు లో మొత్తం ముస్లిం మైనార్టీలను తీసేసి హిందూ ఓసీల జనాభా 10 శాతం లోపే అని అంటుంటే, కాదు 51 శాతం ఉన్న బీసీ జనాభాలోనే ముస్లిం మైనార్టీల జనాభా ఉంటుందని, ఓసీల్లో ఉన్న ముస్లిం, మైనార్టీలు కాకుండానే తమ జనాభా 21 శాతం ఉంటుందని ఓసీ సంఘాలు చెప్తున్నాయి. దీంట్లో ఏది నిజమో ప్రభుత్వమే చెప్పాలి. 

2014 నుంచి 2024 వరకు 3.63 కోట్ల జనాభా కు పదేళ్లలో 5 శాతం పెరుగుదల/ తగ్గుదల అంటే మామూలు విషయం కాదు. దాదాపు 18 లక్ష ల జనాభా. ఈ కులగణనలో బీసీల జనాభా పెరిగినట్టు ఓసీలది తగ్గినట్టు చెప్తున్నారు. కానీ, పెరు గుదల/తగ్గుదలలో ఇంత వ్యత్యాసం ఉండే అవకా శం లేదని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా అస లు కులగణన సర్వేలో పాల్గొనని వాళ్ళను, వారి సంఖ్యను ఎలా గుర్తించారో ప్రభుత్వం తెలపాలి.

ఎక్కడ సర్వేలో అందరూ పాల్గొనలేదనే అపవాదు వస్తుందని ప్రభుత్వం అనుకోరాదు. ఎన్నికల్లో కూడా 100 శాతం పోలింగ్ కాదు. ఎంత శాతం పోలైనా ఓటింగ్‌లో పాల్గొన్న మెజార్టీ ఓటర్లు ఎన్నుకున్న వాళ్ళే ఓటు వేయని వాళ్ళకు కూడా ప్రతి నిధులుగా చట్టసభల్లో ఉంటారు. కాబట్టి, ప్రభుత్వం నిజానిజాలు ప్రజలకు తెలపాలి. ఇప్పటి వరకు సామాజిక వర్గాల వారీగా జనాభాను వెల్లడించారు కానీ, కులాల వారీగా ఆ వివరాలను బహిర్గతం చేయలేదు.

కాబట్టి, ఆ వివరాలనూ ప్రజలకు అందుబాటులో ఉంచాలి. దేశంలో 1931 తర్వాత జరిగిన తొలి కులగణనగా అభివర్ణిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వేలో ఏవైనా తప్పులు దొర్లితే సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. అదే విధంగా ఇంత వరకు కులగణనలో పాల్గొనని వాళ్ళకు మరోసారి పాల్గొనే అవకాశం ఇవ్వాలి. అపుడే సమగ్ర సర్వే జరుగుతుంది.

దాని ఆధారంగా సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వెనకబడి ఉన్న వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, కుల సంఘాల నాయకులు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎవరికి దక్కాల్సిన వాటాకోసం రాజ్యాంగబద్దంగా, ప్రజాస్వామ్య యుతంగా పోరాడితే అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తారు. కానీ, రహస్య ఎజెండాతో బ్రిటిష్ కాలం నాటి ‘విభజించి పాలిం చే’ విధానాన్ని అవలంబిస్తే ప్రజలు తిరస్కరిస్తారు. కనుక, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ కులగణనపై ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేయాలి.

 డా. అక్కెనపల్లి వెంకట్రామ్‌రెడ్డి 

సెల్: 9700206444