calender_icon.png 18 October, 2024 | 5:22 AM

మీ హయాంలో ఒక్కరికైనా ఐవీఎఫ్ చేశారా!

18-10-2024 02:59:33 AM

  1. దమ్ముంటే ఎంజీఎం, పేట్లబుర్జులో ఐవీఎఫ్ సెంటర్లు చూపించండి
  2. బీఆర్‌ఎస్ నేతలకు మంత్రి దామోదర రాజనర్సింహ సవాల్

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): గాంధీ హాస్పిటల్‌లో ఐవీఎఫ్ సేవలను ప్రారంభించడంపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు 2018లో జీవోలు ఇచ్చి ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ నేతలకు దమ్ముంటే ఎంజీఎం, పేట్లబుర్జు దవాఖాన్లలో ఐవీఎఫ్ సెంటర్లు ఎక్కడున్నాయో చూపించాలని సవాల్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో గాంధీ హాస్పిటల్‌లో ఒక్కరికైనా ఐవీఎఫ్ చేసినట్టు నిరూపించాలన్నారు. ఐవీఎఫ్ సేవలు ప్రారంభించకుండా మోసం చేసినందుకుగానూ, మహిళలకు బీఆర్‌ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ మేరకు మంత్రి గురువారం ఓ ట్వీట్ చేశారు.

హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్, పేట్లబుర్జు హాస్పిటల్, వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్‌లో ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు 2018 జీవో విడుదల చేశారని, కానీ ఒక్క హాస్పిటల్‌లో కూడా ఐవీఎఫ్ సేవలు అందుబాటు లోకి తీసుకురాలేదన్నారు. పేట్లబుర్జు, ఎంజీఎంలో పైసా పనిచేయలేదని, ఒక్క పరికరం కూడా కొనుగోలు చేయలేదన్నారు.

2023లో ఎన్నికలకు ముందు గాంధీకి కొన్ని ఎక్విప్‌మెంట్ తీసుకొచ్చి, ఐవీఎఫ్ సేవలను ప్రారంభిస్తున్నట్టు హడావుడి చేశారని ఎద్దేవా చేశారు. ఇవన్నీ తమ ప్రభుత్వం ఏర్పడ్డాక అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. తాము చిత్తశుద్ధితో ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తే ప్రశంసించాల్సింది పోయి చవకబారు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. పేట్లబుర్జు, ఎంజీఎం సహా జిల్లాల్లోనూ ఐవీఎఫ్ సేవలను విస్తరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.