calender_icon.png 21 October, 2024 | 6:44 AM

మహాలోనూ హర్యానా వ్యూహమే!

21-10-2024 12:00:00 AM

  1. బీజేపీ విజయానికి కృషి చేస్తోన్న ఆర్‌ఎస్‌ఎస్ 
  2. అనుబంధ సంస్థలను కలుపుకుని కార్యాచరణ
  3. చిన్న బృందాలను ఏర్పాటు చేసి ప్రజలతో సమావేశాలు
  4. మహాయుతికి అనుకూల దృక్పథం కలిగేలా చర్యలు

ముంబై, అక్టోబర్ 20: హర్యానాలో పదేళ్లుగా అధికారంలో ఉన్నందున్న ప్రభుత్వంపై వ్యతిరేకత ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. ఇందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) క్షేత్రస్థాయిలో పనిచేయడమే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ జన్మభూమి మహారాష్ట్రలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తోంద ని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. మరో నెలరోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి అనుకూలంగా ప్రజల్లోకి వెళ్లింది.

ఇందుకోసం విస్తృత కార్యాచరణ రూపొందించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. బీజేపీకి సైద్ధాంతిక మూలాధార మైన ఆర్‌ఎస్‌ఎస్ దాని అనుబంధ సంస్థలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోందని తెలుస్తోంది. 

చిన్న చిన్న సమావేశాలతో..

రాష్ట్రవ్యాప్తంగా టోళీలు (స్థానిక బృందాలు) ఏర్పాటు చేసింది. ప్రతి బృందం 5-10 కుటుంబాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాయని సమాచారం. ఈ సమావేశాల్లో వారు నేరుగా బీజేపీని సమర్థించకపోయినా జాతీయాసక్తి, హిందుత్వం, సుపరిపాలన, అభివృద్ధి, ప్రజాసంక్షేమం, స్థానిక సమస్యలపై అవగాహన కల్పిస్తారు. తద్వారా అధికార కూటమిపై సానుకూల దృక్పథం కలిగేలా చేస్తారు.

హర్యానా ఎన్నికల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్ ఇదే ఫార్ములాతో విజయవంతమైంది. హర్యానా అంతటా దాని అనుబంధ సంస్థల సహకారంతో ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన రహస్య సమావేశాలు బీజేపీ విజయానికి కీలకంగా మారాయి. హర్యానాలో దాదాపు 1.25 లక్షల సమావేశాలను నిర్వహించినట్లు తెలుస్తోంది. దశాబ్దం క్రితం కాంగ్రెస్ వైఫల్యాలను గుర్తుచేస్తూ బీజేపీ అనుకూలంగా ప్రజల అభిప్రాయాన్ని మార్చగలిగారు. అగ్నిపథ్ స్కీమ్‌పైనా ప్రజల్లో ఆందోళనను తగ్గించి సఫలమయ్యారు.

పార్లమెంట్ ఫలితాలతో మార్పు

ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పనితీరు తగ్గడానికి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం లేకపోవడమే ప్రధాన కారణమని చాలా మంది విశ్వసించారు. ఎన్నికల సమయంలో బీజేపీ అధినేత జేపీ నడ్డా మాట్లాడుతూ.. ప్రారంభంలోనే తమకు ఆర్‌ఎస్‌ఎస్ అవసరం ఉండేదని, ఇప్పుడు తాము సొంతంగా అధికారంలోకి వచ్చేస్థాయికి చేరుకున్నామని అన్నారు.

సంఘ్ కార్యకర్తల నిరుత్సాహానికి ఇది ఒక కారణమని తెలుస్తోంది. కానీ సంస్థ స్థాపన నాటి నుంచి మహారాష్ట్రలో సంఘ్ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. దాని ప్రధాన కార్యాలయం కూడా నాగ్‌పూర్‌లోనే ఉంది.

పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ పేలవ ఫలితాలు రావడంతో ఆర్‌ఎస్‌ఎస్‌పై ఈ విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే హర్యానాలో సంఘ్ తీవ్రంగా కృషి చేసినట్లు సమాచారం. మహారాష్ట్రలోనూ దీన్ని రిపీట్ చేయాలని కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.