calender_icon.png 9 October, 2024 | 5:56 PM

హర్యానా ఫలితాలు ఒప్పుకోం

09-10-2024 01:09:03 AM

ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది

ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: హర్యానా ఎన్నికల్లో బీజేపీ మోసం చేసి గెలిచిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎగ్జిట్‌పోల్స్ అన్నీ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పగా, బీజేపీ ఘనవిజయం సాధించటంపై హస్తం పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తంచేశారు.

ఓట్ల లెక్కింపు సమయంలో లెక్కించిన ఓట్లను వెంటనే వెల్లడించకుండా ఎన్నికల సంఘం ఎందుకు ఆలస్యం చేసిందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఈసీకి లేఖ రాశారు. ఈ ఫలితాలను ఒప్పుకొనేది లేదని తేల్చి చెప్పారు. ఈవీఎంలు కూడా ట్యాంపరింగ్‌కు గురయ్యాయని అనుమానం వ్యక్తంచేశారు.

‘ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడిని ఆలస్యం చేసే చెడు సంప్రదాయం కొనసాగుతున్నది. ఈసీ అధికారికంగా ప్రకటించకముందే ఓట్ల లెక్కింపు వివరాలు సోషల్‌మీడియాలో బహిర్గతమవుతున్నా యి. చాలా కౌంటింగ్ సెంటర్లలో లెక్కింపు కొనసాగుతుండగానే ఫలితాలను వెల్లడించటం ద్వారా కొందరు ఫలితాలను ప్రభా వితం చేస్తున్నారు’ అని ఆరోపించారు. 

కాంగ్రెస్ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 25 రౌండ్లపాటు లెక్కింపు జరిగిందని, ప్రతి రౌండ్ ముగిసిన 5 నిమిషాల్లోనే ఫలితం ప్రకటించామని వెల్లడించింది. కాంగ్రెస్ ఆరోపణలు బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తంచేసింది.