- హర్యానా, కశ్మీర్ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు
- అక్టోబర్ 8న రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు
- పండుగల నేపథ్యంలో మార్చినట్టు ఈసీఐ ప్రకటన
న్యూఢిల్లీ, ఆగస్టు 31: హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల షెడ్యూల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) స్పల్ప మార్పులు చేసింది. హర్యానాలో పోలింగ్‌ను అక్టోబర్ 1వ తేదీకి బదులు 5న నిర్వహించనున్నారు. హర్యానాతోపాటు జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 4వ తేదీకి బదులు 8న ప్రకటిస్తామని ఈసీ శనివారం ప్రకటించింది.
పండుగల వల్లే
హర్యానా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచే అధికార బీజేపీతోపాటు పలు వర్గాలు పోలింగ్ తేదీని మార్చాలని ఈసీని కోరుతున్నాయి. పోలింగ్ తేదీకి ముందు, ఆ తర్వాత సెలవులు ఉండటంతో ఓటర్లు యాత్రలకు వెళ్లే అవకాశం ఉందని, దీంతో పోలింగ్ శాతం తగ్గవచ్చని బీజేపీ ఈసీకి లేఖ రాసింది. బిష్నోయ్ మహాసభ కూడా అక్టోబర్ 2న అసోజ్ అమావాస్య పండుగ ఉన్నందున పోలింగ్ తేదీ మార్చాలని కోరింది. దీంతో షెడ్యూల్‌లో ఈసీఐ మార్పులు చేసింది.
‘జాతీయ, ప్రాంతీయ పార్టీలతోపాటు ఆల్ ఇండియా బిష్నోయ్ మహాసభ నుంచి కూడా పోలింగ్ తేదీ మార్చాలని వినతులు వచ్చాయి. హర్యానాలోని బిష్నోయ్ వర్గం వారు శతాబ్దాలుగా నిర్వహించుకొంటున్న అసోజ్ అమావాస్య ఉత్సవం కోసం రాజస్థాన్‌కు వెళ్తారు. వారి హక్కులను కాదనే అధికారం ఈసీకి లేదు. అందువల్లనే పోలింగ్ తేదీని మార్చాం’ అని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.