యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, యువజన నాయకుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి మృతి పట్ల హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, యువజన నాయకుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి మరణ వార్త తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని దత్తాత్రేయ పేర్కొన్నారు. యువకుడు, జాతీయ భావాలున్న నాయకుడు, సమాజ సేవకు అంకిత భావంతో పనిచేసిన జిట్టా బాలకృష్ణ రెడ్డి తనకు అత్యంత ఆప్తుడని, యువతకు క్రీడా కార్యక్రమాలు నిర్వహించి, యువకులను సంఘటితపరిచేందుకు దోహదపడ్డారు.
స్వామి వివేకానంద విగ్రహావిష్కరణతో బాటు యువజన సంఘాల అధ్యక్షునిగా అనేక కార్యక్రమాలు నిర్వహించి తనను ఆహ్వానించేవాడని వారితో తనకున్న సాన్నిహిత్యాన్ని దత్తాత్రేయ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తెలంగాణ యువ శక్తి పార్టీని స్థాపించారని, 2009 లో స్వతంత్ర అభ్యర్థిగా భోనగిరి నియోజకవర్గంనుండి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారని, తెలంగాణ జాతరలు పెట్టి, తెలంగాణ వంటకాల రుచిని, తెలంగాణ పండుగల పవిత్రతను చూపెట్టి, తెలంగాణ నాటక రంగలను ఆకట్టుకునేలా, తెలంగాణ సాంప్రదాయ సంస్కృతికి అద్దం పట్టేలా అనేక కార్యక్రమాలు నిర్వహించి తనను ఆహ్వానించేవారని, ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో తనదంటూ ముద్ర వేశారు.
ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపించే మంచి భవిష్యత్తు ఉన్న నాయకున్ని కోల్పోవడం నల్గొండ రాజకీయాలకు తీరని లోటు అని, తాను ప్రతి ఏటా నిర్వహించే అలై బలైతో బాటు ఏ పని అప్పగించినా చిత్తశుద్ధితో పూర్తిచేసేవాడని, బాలకృష్ణ రెడ్డి సేవలను బండారు దత్తాత్రేయ చెప్పుకోచ్చారు. తెలంగాణ సాంప్రదాయ సంస్కృతికి అద్దం పట్టేలా భువనగిరి గడ్డపై యువతను ఐక్యపరిచి తెలంగాణ రాష్ట్ర సాధననే లక్ష్యంగా ఎంచుకుని మలిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన జిట్టా బాలకృష్ణ రెడ్డి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని, వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని, ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలియజేసారు.