calender_icon.png 5 October, 2024 | 2:44 AM

నేడు హర్యానా అసెంబ్లీ పోలింగ్

05-10-2024 12:52:31 AM

  1. మొత్తం 90 స్థానాలకు ఒకే దశలో పోలింగ్
  2. బరిలో 1,031 అభ్యర్థులు
  3. ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం

హర్యానా, అక్టోబర్ 4: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. శనివారం ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

వీరిలో 101 మంది మహిళలు ఉన్నారు. 464 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. హర్యానాలో 2 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉండగా వీరి కోసం 20,629 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఓటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. ఎన్నికల నిర్వహణకు 24,719 కంట్రోల్ యూనిట్లు, 26,774 వీవీప్యాట్లను ఉపయోగించనున్నారు.  

కట్టుదిట్టమైన భద్రత

ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్ వెల్లడించారు. 30 వేల మంది పోలీసులు, 225 పారామిలిటరీ కంపెనీలను మోహరించినట్లు పేర్కొన్నారు. అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 186 అంతర్రాష్ట్ర, 215 అంతర్గత చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని చెప్పారు.

ఎన్నికల కోడ్‌ను సక్రమంగా అమలు చేసేందుకు 507 ఫ్లయింగ్ స్వాడ్లు, 464 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 32 క్విక్ రెస్పాన్స్ బృం దాలతో పాటు అదనంగా 1,156 పెట్రోలింగ్ సిబ్బంది ఏర్పాటు చేశారు. 144 ఆదర్శ పోలింగ్ కేంద్రాలు, 115 కేంద్రాల్లో పూర్తిగా మహిళా సిబ్బంది, వికలాంగుల ఆధ్వర్యంలో 87 కేంద్రాలు, యువకులతో 114 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నట్లు సీఈవో అగర్వాల్ వెల్లడించారు.    

బరిలో ప్రముఖులు

హర్యానాలో అధికార బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తామని ధీమాగా ఉంది. ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఎం నయాబ్‌సింగ్ సైనీ ప్రజలను కోరారు. ప్రజాస్వామ్య పండుగలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. దేశం, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని, హర్యానాలో మళ్లీ కమలం వికసించాలని సూచించారు.

దశాబ్దం తర్వాత పునరాగమనం కోసం కాంగ్రెస్ ఎదురుచూస్తోంది. పోటీలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ, బీఎస్పీ, ఆజాద్ సమాజ్ పార్టీ, ఐఎన్‌ఎల్డీ కూడా బలంగా నిలబడ్డాయి. సీఎం సైనీ, ప్రతిపక్ష నేత భూపిందర్‌సింగ్ హుడా, మహిళా బాక్సర్ వినేశ్ ఫొగట్(కాంగ్రెస్), కీలక నేతలు అభయ్‌సింగ్ చౌతాలా (ఐఎన్‌ఎల్డీ), దుష్యంత్ చౌతాలా (జేజేపీ), ఇనిల్ విజ్ (బీజేపీ), అనురాగ్ ధండా (ఆప్) తదితర అభ్యర్థులు తమ భవిష్యత్తును పరీక్షించుకోనున్నారు.

స్వతంత్రుల అభ్యర్థులు సావిత్రి జిందాల్ (హిస్సార్), రంజిత్ చౌతాలా (రానియా), చిత్ర సర్వారా (అంబాలాకాంఠా) బరిలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి కొంతమంది రెబెల్స్ కూడా పోటీలో ఉన్నారు.