బల్దియాలో సంబురాలు నిర్వహించిన మేయర్, డిప్యూటీ మేయర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌కు బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్లను కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బల్దియా కార్యాలయం వద్ద సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు స్వీట్లు పంపిణీ చేసుకొని బాణసంచా పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించడం, అందులో జీహెచ్‌ఎంసీకి రూ. 3065 కోట్లను కేటాయించినందుకు ప్రభుత్వా నికి కృతజ్ఞతలు తెలియజేశారు.
వాటర్ బోర్డుకు ప్రత్యేకంగా రూ. 3385 కోట్లు కేటాయించడం వల్ల నగరంలోని మంచినీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ బడ్జెట్‌లో మూసీ అభివృద్ధి, మెట్రో విస్తరణకు ప్రత్యే క నిధులు కేటాయించడం గొప్ప విషయం అని అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఓఆర్‌ఆర్ దాకా విస్తరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. బడ్జెట్‌లో గత ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ అవి జీహెచ్‌ఎంసీ దాకా చేరలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బాబా ఫసియొద్దీన్, రాజశేఖర్ రెడ్డి, బొంతు శ్రీదేవి, జితేందర్, రాజు, గణేష్ గౌడ్, సుజాతానాయక్ తదితరులు పాల్గొన్నారు.