- ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తే సహించం..
- అణగారిన వర్గాలకు న్యాయం చేసేందుకే సర్వే
- బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు సర్వేను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి
- ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కులగణన సర్వేకు ఎవరైనా ఆటంకం కలిగించినా, ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించినా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్రవారం ఓ ప్రకటనలోహెచ్చరించారు.
గత ప్రభుత్వం చేయించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు అందుబాటులో ఉండగా, మళ్లీ ఎన్యూమరేషన్ అవసరమా..? అని బీఆర్‌స్ నేతలు ప్రశ్నిస్తున్నారని, అప్పటి పాలకులకు అనుగుణం గా, వారు కోరిన విధంగానే సర్వే మదింపు జరిగిందని స్పష్టం చేశారు. సామాజిక, ఆర్థిక, విద్య, సమగ్ర కులగణన అనగానే బీఆర్‌ఎస్, బీజేపీ నేతల్లో గుబులు మొదలైందన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మేలు చేసే సర్వేను ఆ రెండు పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందిం చే ప్రభుత్వ ఆశయాన్ని గుడ్డిగా ఎందుకు తప్పు పడుతున్నాయో చెప్పాలని నిలదీశారు. పింఛన్లు, రేషన్ కార్డులు తొలగించేందుకే కులగణన చేస్తున్నామని దుష్ప్రచారం చేయడం దారుణమ న్నారు.
2011లో జనాభా లెక్కలు జరిగిన తర్వాత, మళ్లీ 2021లో జనాభా లెక్కలు తీయాల్సి ఉందన్నారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనభా గణనను దాటవేస్తూ వస్తుందని మండిపడ్డారు. వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం, ఆర్థిక తోడ్పాటు అందించేందుకే సర్వే చేపడుతున్నామని తేల్చిచెప్పారు.
రాష్ట్రప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు తెలుసునని ధీమా వ్యక్తం చేశారు. కులగణను స్వాగతిస్తేనే ఆ పార్టీలకు మనుగడ ఉంటుందని, లేదంటే, ప్రజలే బుద్ధి చెప్పాల్సిన రోజు వస్తుందని అభిప్రాయపడ్డారు. ఎన్యుమరేషన్ సమయంలో ప్రజలు ఎన్యుమరేటర్లకు సహకరించాలని, వారు అడిగిన వివరాలను చెప్పాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.