calender_icon.png 30 September, 2024 | 4:06 AM

మరో పోల్‌లోనూ హారిస్ ముందంజ

28-09-2024 01:49:06 AM

అరిజోనా, మిషిగన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో పట్టు

వాషింగ్టన్, సెప్టెంబర్ 27: అగ్రరాజ్యం అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో  గెలుపెవరిదోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. మరోవైపు యూఎస్‌లోని పలు సంస్థలు బరిలో నిలిచిన అభ్యర్థుల విజయావకాశాలపై సర్వేలు నిర్వహిస్తున్నాయి.

తాజాగా ప్రఖ్యాత యూమాస్ లోవెల్స్ సెంటర్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ యుగవ్ సంస్థ విడుదల చేసిన పోల్ సర్వేలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్.. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లు పేర్కొంది.

అరిజోనా, మిషిగన్, పెన్సిల్వేనియా లాంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో హారిస్ పట్టు సాధిస్తున్నట్లు వెల్లడించింది. మిచిగాన్‌లో ట్రంప్‌నకు 43 శాతం, హారిస్‌కు 48 శాతం మంది మద్దతునిస్తుండగా, జార్జియాలో ఏకంగా 51 శాతం మంది హారిస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది.

యుమాస్ లోవెల్ పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రోడ్రిగో కాస్ట్రో కార్నెజో సైతం మిచిగాన్‌లో ట్రంప్‌నకు ప్రతికూలత ఉండటం హారిస్‌కు లబ్ధి చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే అరిజోనాలో హారిస్‌కు విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు  తెలిపారు.

కాగా ఇటీవల అధ్యక్ష రేసులో నిల్చొన్న ట్రంప్, కమలా తొలి డిబేట్‌లో పాల్గొన్నారు. దీనిలో హారిస్‌దే విజయమని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అక్టోబర్ 1న న్యూయార్క్‌లో ట్రంప్ రన్నింగ్‌మేట్ జేడీ వాన్స్ వైస్‌ప్రెసిడెంట్ టీమ్ వాజ్ మధ్య చర్చ జరగనుంది.