06-03-2025 11:39:53 PM
జీడీపీలో తగ్గుదలతోపాటు దేశానికి ఏటా 7 బిలియన్ డాలర్ల నష్టం..
వెల్లడించిన పలు నివేదికలు..
న్యూఢిల్లీ: అమెరికా విధించే అధిక టారిఫ్‌ల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మందగించడంతోపాటు దేశానికి ఏటా 7 బిలియన్ నష్టం వాటిల్లనున్నట్టు తెలుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించబోయే అధిక సుంకాలు భారత్ నుంచి ప్రధానంగా ఆటోమొబైల్స్, రసాయనాలు, ఆభరణ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులపై పెద్ద మొత్తంలో ప్రభావం చూపనున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌కు ఏటా 7 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని సిటీ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. 2023లో భారత్, అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై సగటున 11% శాతం వెయిటెడ్ టారిఫ్‌లను విధించింది.
ఇది భారత్ ఎగుమతి చేస్తున్న ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాల కంటే 8.2శాతం ఎక్కువ. అమెరికాకు చెందిన 42 బిలియన్ల డాలర్ల విలువైన ఉత్పత్తులు గత ఏడాది భారత్‌లో అత్యధిక సుంకాలను ఎదుర్కొన్నాయి. వ్యవసాయ ఉత్పత్తులపై మోస్ట్ ఫేవర్డ్ నేషన్ విధానం కింద భారత్ నుంచి వచ్చే దిగుతులపై తాము 5% సుంకాలు విధిస్తుండగా.. భారత్ మాత్రం అమెరికా నుంచి వెళ్లే ఉత్పత్తులపై అత్యధికంగా 39% సుంకాలు వేస్తోందని శ్వేతసౌధం తాజాగా విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌లో పేర్కొంది. ఈ క్రమంలో వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకాలు విధిస్తే.. దేశ వ్యవసాయ, ఆహార ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఆర్థిక మందగమనం
అధిక టారిఫ్‌ల ప్రభావం వల్ల 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు చేసే ఎగుమతుల విలువ 7 బిలియన్ డాలర్ల నుంచి 2 బిలియన్ డాలర్లకు పడిపోయే ప్రమాదం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తన నివేదికలో హెచ్చరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ మధ్య అమెరికాకు భారతదేశ ఎగుమతులు 5.57శాతం పెరిగి 59.93 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో అమెరికా నుంచి దిగుమతులు 1.91 శాతం పెరిగి 33.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అమెరికా కొత్త సుంకాలు భారత జీడీపీపై ప్రభావం చూపనున్నాయి.
ప్రస్తుతం దేశ జీడీపీ 6.6% గా అంచనా వేస్తుండగా.. కొత్త టారిఫ్‌ల వల్ల జీడీపీలో 5 బేస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ దేవేంద్ర కుమార్ పంత్ పేర్కొన్నారు. కాగా అమెరికాతో నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. టాప్ మోడల్ ద్విచక్ర వాహనాలపై విధిస్తున్న సుంకాలను 50% నుంచి 30 శాతానికినికి తగ్గించింది. అలాగే బోర్బన్ విస్కీపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని 150% నుంచి 100%నికి తగ్గించింది.