calender_icon.png 1 April, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటుకు హరిత హోటళ్లు, రెస్టారెంట్లు

30-03-2025 01:00:04 AM

టూరిజం పాలసీ అమలుపై పర్యాటక శాఖ దృష్టి

టెండర్లను ఆహ్వానించిన టీజీటీడీసీ

హైదరాబాద్, మార్చి 29(విజయక్రాంతి): టూరిజం పాలసీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పాలసీలో భాగంగా పీపీపీ మోడ్‌లో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) ఆధ్వర్యంలో నడిచే 21 హరిత హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సముదాయాల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో హరిత హోటళ్ల నిర్వహణ కోసం అర్హత ఉన్న ప్రైవేట్ సంస్థల నుంచి టీజీటీడీసీ టెండర్లను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత ఉన్న సంస్థలు ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఐదేళ్ల కాలపరిమితితో టీజీటీడీసీ టెండర్లకు పిలుస్తోంది. వచ్చే ఐదేళ్ల కాలానికి ప్రభుత్వం టూరిజం పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. పాలసీ లక్ష్యాలను చేరుకోవాలంటే.. పర్యాటక శాఖకు చెందిన నివాస సముదాయాలు అధునాత హంగులతో  పర్యాటకులను ఆకర్శించేలా ఉండాలి. ఈ క్రమంలో టూరిస్టులను ఆకట్టుకునేలా తీర్చిదిద్ది, నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని టీజీటీడీసీ నిర్ణయించింది. టెండర్లకు అహ్వానించిన వాటిలో రాష్ట్రంలోని 21 ప్రాంతాల్లో ఉన్న హరిత రెస్టారెంట్లు, హోటళ్లను పీపీపీ మోడ్‌లో టీజీటీడీసీ నిర్వహించనుంది.