calender_icon.png 5 December, 2024 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టులో హరీశ్ పిటిషన్

05-12-2024 01:12:50 AM

రాజకీయంగా ఎదుర్కొనలేకే పంజాగుట్ట ఠాణాలో తనపై కేసు

హైదరాబాద్, డిసెంబర్ 4, (విజయక్రాంతి): తనపై అసత్య ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి గాధగోని చక్రధర్ గౌడ్ కుట్రపూరితంగా కేసు పెట్టారని, ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హైకోర్టులో బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలుచేశారు.

తాను మంత్రిగా ఉండగా చక్రధర్ గౌడ్ ఫోన్లను ట్యాపింగ్ చేయించానంటూ ఈ నెల 1న ఆయన ఇచ్చిన ఫిర్యాదుకు ఆధారాల్లేవన్నారు. తాను మంత్రిగా ఉండగా ఫోన్లు ట్యాప్ చేయించానని ఇంతకాలానికి ఫిర్యాదు చేయడానికి కారణాలు కూడా వివరించలేదన్నారు. ఎఫ్‌ఐఆర్‌పై స్టే మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని, తుది తీర్పులో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని, చక్రధర్ గౌడ్‌ను ప్రతివాదులుగా చేర్చుతూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ జరుపనున్నారు. రాజకీయ కుట్రతో చేసిన ఫిర్యాదును పోలీసులు ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే వెంటనే నమోదు చేశారన్నారు.

ఫోన్‌ట్యాపింగ్ చేయించానంటూ తనతోపాటు రాధాకిషన్‌రావు, ఇతరులపై గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. కట్టుకథతో ఏ ఆధారాలు లేకుండా ఫిర్యాదు చేశారన్నారు. ఈ కేసులో తనను పోలీసులు అరెస్టు చేసినట్లయితే మచ్చలేని తన రాజకీయ జీవితానికి సమస్యలు వస్తాయన్నారు.

ప్రజల్లో ఉన్న పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయన్నారు. బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి సిద్దిపేటలో తనపై ఓడిపోయిన గౌడ్ రాజకీయ ప్రతీకారంతో కేసుల మీద కేసులు పెడుతున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌పై హైకోర్టులో దాఖలు చేసిన కేసును గౌడ్ ఆ తరువాత ఉపసంహరించుకున్నారన్నారు. తప్పుడు కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.