హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. ఇంటింటి కుటుంబ సర్వే విధుల నుంచి ఎస్జీటీలను మినహాయించాలని లేఖలో పేర్కొన్నారు. సర్వేకు ఎస్జీటీలను వినియోగించడం విద్యాహక్కు చట్టం ఉల్లంఘనే అని, ఇంటింటి కుటుంబ సర్వేకు ఎస్జీటీలు, హెచ్ఎంలను భాగం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, కుటుంబ సర్వే విషయంలో సర్కార్ అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల విద్యార్థులు, టీచర్లకు శాపంగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేకు టీచర్లను వినియోగించి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని హరీశ్ రావు మండిపడ్డారు.