హైదరాబాద్: ఖమ్మం పత్తి మార్కెట్ లో బీఆర్ఎస్ నేతలు బృందం శుక్రవారం పర్యటిస్తుంది. పత్తి రైతుల సమస్యలను బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, గంగుల, వద్దిరాజు రవిచంద్ర అడిగి తెలుసుకుంటున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను నేతలు తెలుసుకున్నారు. మార్కెట్ లో పత్తి ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని హరీశ్ రావు ఆరోపించారు.
పత్తికి రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పారు. బోనస్ ను బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని హరీశ్ రావు మండిపడ్డారు. కనీసం మద్దతు ధర వచ్చే పరిస్థితి కూడా లేదని ఆయన పేర్కొన్నారు. రైతులకు సాయం చేయడానికి ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది? అని హరీశ్ ప్రశ్నించారు. రైతులను ఆదుకోలేదు, వ్యవసాయ కూలీలను ఆదుకోలేదన్నారు. పత్తి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం పత్తి మార్కెట్ లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పత్తి రైతులకు మద్దతు ధర రావట్లేదన్నారు. 2021లో రూ, 11 వేలకు పత్తి కొనుగోలు చేశాం.. దళారుల దోపిడీ వల్ల ధర తగ్గిందని తెలిపారు. మద్దతు ధర రూ. 7,520 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్ పేర్కొన్నారు. మిర్చి రైతులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి పత్తి కొనుగోలుపై సమీక్ష చేయట్లేదని హరీశ్ రావు ఆరోపించారు.