హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రికి వెళ్లారు. పోలీసుల తోపులాటలో నిన్న హరీష్ రావు ఎడమ చేతికి గాయం అయింది. హరీష్ రావుకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. హరీష్ రావుతో పాటు ఏఐజి హాస్పిటల్ కి పోలీసులు చేరుకున్నారు. ఆస్పత్రికి వెళ్లడానికి మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు.
ఆరెకపూడి గాంధీ నివాసంలో ర్యాలీ, సమావేశం జరగడంపై పోలీసులు అప్రమత్తం కావడంతో శుక్రవారం పలువురు బీఆర్‌ఎస్ నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్ రావు కోకాపేటలోని తన నివాసానికే పరిమితమయ్యారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో గురువారం నాయకులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో గాయపడిన ఆయనకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లేందుకు పోలీసులు ముందు అనుమతి నిరాకరించి అనంతరం అనుమతిచ్చారు.