పట్నం నియామకం రాజ్యాంగ విరుద్ధం
- పీఏసీ చైర్మన్ షయంలోనూ ఇదే తీరు
- రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరగుతోంది
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): శాసనమండలి చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని నియమించడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, పీఏసీ చైర్మన్ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు.
పట్నం మహేందర్‌రెడ్డిపై శాసన మండలి చైర్మన్ వద్ద ఇప్పటికే అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉన్నదని, చైర్మన్ ఇచ్చిన బులెటిన్ అనర్హత పిటిషన్‌కు మరింత బలం చేకూరిందని చెప్పారు. దీనిని కూడా అనర్హత పిటిషన్‌లో సాక్ష్యంగా చేరుస్తామని, ఎమ్మెల్సీ హోదాలో ఆగస్టు 15న,సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేశారని పేర్కొన్నారు.
మార్చి 15 నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ అని బులెటిన్ ఇచ్చారని, దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తామని, రాష్ట్ర గవర్నర్‌తో పాటు డీవోటీకి కూడా లేఖ రాస్తానని స్పష్టంచేశారు. గవర్నర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎన్‌కౌల్, ఎస్ శక్తిధర్ రాసిన ‘ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంటు’ పుస్తకంలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు.
విప్‌లను వారి పార్టీ సభ్యుల నుంచి మాత్రమే ఎంపిక చేయాలని అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీని కాంగ్రెస్ చీఫ్ విప్‌గా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ వ్యవస్థను ఖూనీ చేస్తుందనడానికి ఇది నిదర్శమని స్పష్టంచేశారు. పట్నం మహేందర్‌రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చీఫ్‌విప్ ఎంపిక రాజ్యాంగబద్ధమే
- ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు
- నాడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా?
- మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): శాసనమండలి చీఫ్ విప్ సహా నియామకాలు అన్నీ రాజ్యాంగ బద్ధంగానే జరిగాయని, ఎక్కడ ఉల్లంఘనలేదని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదని అన్నారు.
కేసీఆర్ పాలనలో హరీశ్‌రావు శాసన సభా వ్యవహరాల మంత్రిగా ఉన్న సమయంలో ఏం జరిగిందో అందరికి తెలుసని పేర్కొన్నారు. నాడు ఆయనకు రాజ్యాంగం ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్నారని, అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్నాకే మండలి చైర్మన్, సభాపతి నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు.
సంప్రదాయం ప్రకారమే ప్రతిపక్ష సభ్యునికి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామని, అనర్హత పిటిషన్ల అంశంపై న్యాయస్థానం పరిధిలో ఉందని చెప్పారు. బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికైన పట్నం మహేందర్‌రెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించడం రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రభుత్వ తీరును హరీశ్‌రావు తప్పుబట్టడం సరికాదని హితవు పలికారు.