- ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ
- ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
పాపన్నపేట, జూలై 17: ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. బుధవా రం పాపన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరి గా లేకున్నా రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నాయకు లు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.
కాగా కొంతమంది విద్యుత్ ఉద్యోగులతో బీఆర్‌ఎస్ నాయకులు కుమ్మక్కై కృత్రిమ విద్యుత్ కోతలను విధించి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అంతకుముందు మండల పరిధిలోని బాచారం గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో మృతి చెందిన కుటుంబాల సభ్యులకు రూ.25వేల చొప్పు న ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయనవెంట కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు గోవింద్‌నాయక్, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్‌రెడ్డి, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రమేశ్‌గుప్తా ఉన్నారు.