calender_icon.png 30 January, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

5 వరకు హరీశ్‌రావును అరెస్టు చేయొద్దు

29-01-2025 01:46:03 AM

పోలీసులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు 

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో టీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును ఫిబ్రవరి 5 వరకు అరెస్టు చేయ రాదని పోలీసులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో జారీ చేసిన ఉత్తర్వులను మంగళవారం జస్టిస్ కే లక్ష్మణ్ మరోసారి పొడిగించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పీఎస్‌లో తనపై నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్’ కేసును కొట్టివేయాలంటూ హరీశ్‌రావు పిటిషన్ వేశారు. పోలీసుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ వాదిస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు చెప్పారు.

దీంతో విచారణ వచ్చే నెల 5కి వాయిదా పడింది. అప్పటి వరకు హరీశ్‌రావును అరెస్టు చేయరాదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.  ఇదిలా ఉండగా ఈ కేసులో తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చక్రధర్‌గౌడ్‌కు నేర చరిత్ర ఉందని హరీశ్‌రావు అఫిడవిట్ దాఖలు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో అందిన ఫిర్యాదు మేరకు తనపై నమోదైన కేసులో ఏసీపీ ఆరోపణలకు ఆధారాలు లేవన్నారు. చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు. రాజకీయ ప్రత్యర్థుల అండతో లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోందన్నారు.

అత్యాచారం, కిడ్నాప్ వంటి కేసుల్లో ఆరోపణలను చక్రధర్‌గౌడ్ ఎదుర్కొంటున్నారని, 11 కేసులు ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాల పేరుతో వేల మందిని నిరుద్యోగులను మోసం చేసిన కేసు కూడా ఉందన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికే తప్పడు కేసు పెట్టారన్నారు. ప్రాథమిక విచారణ చేయకుండానే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్నారు.