calender_icon.png 18 April, 2025 | 1:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాన్యుడికి ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయమా?: హరీశ్ రావు

10-04-2025 05:36:11 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సుప్రీం కోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చైర్మన్, సభ్యులను బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం గురువారం హోటల్ తాజ్ కృష్ణాలో  కలిసింది. కంచె గచ్చిబౌలి భూముల్లో రేవంత్ సర్కారు జరుపుతున్న పర్యావరణ విద్వంసం, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు లేవనెత్తిన అంశాలు, వాస్తవాలను నివేదిక రూపంలో కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... సుప్రీంకోర్టు నుంచి కమిటీ సభ్యులు వస్తున్నారని తెలిసి కంచ గచ్చిబౌలి అటవీ భూముల్లో రాత్రికి రాత్రే టీజీఐఐసీ బోర్డులు(TGIIC Bords) తెలంగాణ ప్రభుత్వం పెట్టిందని ఆరోపించారు.

ఈ విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్లామని, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంటే కూడా సీఎం రేవంత్ రెడ్డికి లెక్కలేకుండా పోయిందని హరీశ్ రావు విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూములపై ఆందోళన చేసినా అటవీశాఖ అధికారులు స్పందించలేదని, అటవీశాఖ స్పందించకపోవడం వల్లే చెట్లు నరికేశారని, జంతువులు చనిపోయాయని చెప్పారు. వాల్టా చట్టం ప్రకారం చెట్లు కొట్టాలంటే ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలని, అటవీశాఖ అనుమతి ఇచ్చాకే చెట్లను కొట్టాలన్నారు. వాల్టా చట్టం ప్రకారం పట్టా భూమిలో చెట్లు కుట్టాలన్నా అనుమతి తీసుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టు నిబంధనలు, తీర్పులను పట్టించుకోకుండా చెట్లను నరికేశారని మండిపడ్డారు.

కంచ గచ్చిబౌలి భూములు హెచ్సీయూకి చెందినవే అని, గతేడాది నవంబర్ 22న ఆ భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు రుణం తెచ్చినట్లు హరీశ్ రావు తెలిపారు. రుణం ఇప్పించిన మధ్యవర్తికి రూ.170 కోట్లు లంచం ఇచ్చినట్లు సాక్షాత్తూ అసెంబ్లీలోనే చెప్పారని హరీశ్ రావు విమరించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించి పండుగ రోజులు, సెలవు దినాల్లో పర్యావరణ విధ్వంసం చేసిందన్నారు. పేద రైతు తన పొలంలో ఉన్న ఒక చెట్టు కొడితే పోలీసులు, ఎమ్మార్వో వెళ్లి లక్షల పెనాలిటి వేస్తారు. మరీ రేవంత్ రెడ్డి వేల సంఖ్యలో చెట్లు నరుకుతుంటే ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు?,  సామాన్యుడికి ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయమా? అని  ప్రశ్నించారు.