calender_icon.png 18 April, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోస్తున్న సర్కారు: హరీశ్ రావు

15-04-2025 05:51:16 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతున్నదన్నారు. అకాల వర్షాలు, సాగు నీటి గోస, కరెంట్ కష్టాలను ఎదుర్కొని రైతు దంపతులు 18 ఎకరాలు  కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తే  కాంగ్రెస్ ప్రభుత్వ రూపంలో విపత్తు రైతన్నను నట్టేటముంచిందని విమర్శించారు. కొండంత సంబురంతో పంటను కొనుగోలు కేంద్రానికి తరలించి 20 రోజులు గడిచినా ప్రభుత్వం పంట కొనుగోలు చేయలేదు. దీంతో అకాల వర్షం ఆ రైతన్నను నిండా ముంచిందని, కష్టపడి పండించిన ధాన్యమంతా తడిసి ముద్దయిందన్నారు.

ప్రభుత్వం ధాన్యం కొనకపోగా, పరిహారం కూడా చెల్లించకపోవడంతో తడిసిన ధాన్యం రాశి ముందు రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదని చెప్పడానికి ఈ రైతుల కన్నీటి దృశ్యమే ప్రత్యక్ష సాక్ష్యమని మండిపడ్డారు. రైతుల జీవితాల్లో కాలం తెచ్చిన విపత్తు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన విపత్తు ఇది అని పేర్కొన్నారు. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా ఇవాళ అకాల వర్షాలపాలు చేసి ఆగం చేస్తున్నారని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు.

నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోస్తున్న కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ వైఖరిని యావత్ తెలంగాణ గమనిస్తున్నదని హరీశ్ రావు చెప్పారు. మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ పాలకులారా రైతన్న గోస ఇకనైనా పట్టించుకొని వారి కన్నీటి కష్టాలు తీర్చండని డిమాండ్ చేశారు. ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదని గుర్తు పెట్టుకోండని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు.