calender_icon.png 2 November, 2024 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్ కోతలపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

15-05-2024 03:51:32 PM

హైదరాబాద్: కరెంట్ కోతల విషయంలో సిఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. విద్యుత్ రంగ వైఫల్యాలకు తానే భాద్యుడిని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తున్నదని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం, 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు.. విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ సర్కార్ రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపిందని పేర్కొన్నారు.కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్ప కూల్చిందని హరీశ్ రావు ఆరోపించారు. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు.  

తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను చీటికి మాటికి నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనన్న హరీశ్ రావు. విద్యుత్ ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు మాని కేసీఆర్ హయాంలో రెప్ప పాటు కూడా పోని విధంగా 24 గంటల విద్యుత్ ను ఇచ్చినట్టుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిదని సూచించారు. తన లాగే అందరూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతారని సీఎం భ్రమల్లో ఉన్నట్టున్నారు. వాటిని వీడి పాలన పై దృష్టి పెడితే మంచిదని హరీశ్ రావు పేర్కొన్నారు.