calender_icon.png 13 January, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల్ని నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం

12-01-2025 07:34:01 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): ప్రతిపక్ష నేతల కట్టడికే పోలీసులను వాడుతున్నారని, అందువల్ల రాష్ట్రంలో క్రైం రేట్ తీవ్రత పెరిగిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాల కార్యాలయాలు, ఇళ్లపై దాడులు జరిపిస్తోందని మండిపడ్డారు. విపక్ష నేతలపై దాడుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి ధ్వజమెత్తారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రైతుల్ని నట్టేట ముంచిందని, ఇంకా సిగ్గులేకుండా ఏడాది పాలన సంబరాలు చేయమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వస్తే రైతులు నిలదీస్తున్నారని, రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అయినా నిలబెట్టుకుందా..? అని ప్రశ్నించింది. హామీలు నెరవేర్చినట్లయితే తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఎన్నికల ముందు రైతులకు ఎకరానికి రూ.9 వేలు ఇస్తామని చెప్పి వానాకాలం గుండు సున్నా చుట్టి యాసంగికి ఎగోట్టారని హరీశ్ రావు విమర్శించారు. 

కాంగ్రెస్ నాయకులు ఊర్లోకి వస్తే ఎకరాకి రూ.15 వేలు ఇవ్వాల్సిందే అని నిలదీయాలని రాష్ట్ర ప్రజలను కోరారు. మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలన్ని ఎన్నికలకు ముందు నోరు పెంచి అరిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక్క పంటకు కూడా సరిగా ఇవ్వపోగా, కౌలు రైతులను అసలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రూ.15 వేలు ఇస్తానని, రూ.9 వేలు ఎగ్గొట్టి, రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉంటే కేవలం 10 లక్షల మందికి మాత్రమే అంటున్నారు. ఉపాధిలో 90 లక్షల మందికి ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. ఒక ఎకరం భూమి ఉన్న వారిని కూడా రైతులుగా గుర్తించి రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ ను డిమాండ్ చేశారు. భూమి ఉన్నోళ్ళకు నష్టం చేసి భూమి లేనోళ్ళకు లాభం కలిగించేలా సర్కారు చర్యలు తీసుకుంటుందని, ఉపాధి హామీలో మట్టిపనికి పోయేటోల్లకు నష్టం చేస్తుందన్నారు. అధికార పార్టీకి ప్రతిపాదనలు చేసేటప్పుడు కనీస సోయి లేకుండా పోయిందని, మట్టిపనికి పొయెటోల్లంతా కూలీలే.. వారందరిని కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించి రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి బుకాయింపులు మాని ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చెయ్యండని సూచించారు.అడుగడుగునా దగా చేస్తూ రైతుల్ని నట్టేట ముంచారని, అసెంబ్లీ లో చెప్పిన మాటలు కూడా తప్పుతున్నారు. పది పంటలకు బీమా అని చెప్పి ఒక్క పంటకే ఇచ్చారా? అని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఎన్నికల ముందు ఓట్లు గల్లల వేసుకోవడానికి ఇచ్చిన ప్రధానమైన ఆరు హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సంక్షేమంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రజల దృష్టి మళ్లించేందుకు హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారు. యాదాద్రిలో దాడులు చేస్తున్నవారిని పోలీసులే ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. హోం మంత్రి, ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే హింసాత్మక సంఘటనలను ప్రోత్సహిస్తే పెట్టుబడులు వస్తాయా ? అని అడిగారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, సినీ నటుడు అల్లు అర్జున్, బీఆర్ఎస్, బీజేపీ కార్యాలయాలపైనా కాంగ్రెస్ గుండాలు దాడులు చేస్తుంటే ముఖ్యమంత్రి మౌనం ఉండటం దారుణామన్నారు. రాగద్వేషాలకు అతీతంగా పాలిస్తానని ప్రమాణం చేసి, అందుకు విరుద్ధంగా నీ పాలన ఉందని రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు అసహనం వ్యక్తం చేశారు. సీఎంకి రాష్ట్రం కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని, రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నారు. తామ ఓపికను బలహీనంగా తీసుకోవద్దని, ప్రశ్నిస్తే దాడులు చేయడం మంచిది కాదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరిస్తే విపక్ష నేతల అరెస్టు చుట్టే పోలీసుల్ని తిప్పడంతో రాష్ట్రంలో క్రైం రేట్ పెరిగింది. రాష్ర్ట ప్రభుత్వం దాడుల సంస్కృతి మార్చకుంటే కేంద్రం జోక్యం చేసుకోని, రాష్ట్రపతి పాలన పెట్టీ రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని కేంద్రాన్ని కోరారు.  మతకలహాలు పెరగాడంతో క్రైం రేట్ 23 శాతం పెరిగిందని హరీశ్ రావు పేర్కొన్నారు.