హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా, మైలారంలో మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ ని అరెస్టు చేయడం అమానుషమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Former Minister, MLA Harish Rao) తెలిపారు. ప్రజా పాలన, ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టి, ఇప్పుడు ప్రజల తరుపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు నొక్కడం దారుణమని హరీశ్ రావు మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy).. ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పిన మీరు కంచెలు, ఆంక్షలు, అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారని తెలిపారు. మీ సొంత జిల్లాలోనే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మైలారంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రశ్నించారు. ప్రొఫెసర్ హరగోపాల్ సహా అరెస్టులు చేసిన ప్రజా సంఘాల నాయకులను తక్షణం విడుదల చేయాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool District)లో మైనింగ్‌ను నిరసిస్తూ బల్మూరు మండలం మైలారం గ్రామంలో సోమవారం నిర్వాసితులు నిరసన చేపట్టారు. మైనింగ్ వద్దు, గుట్ట ముద్దు అనే నినాదంతో రైతులు నిరవధిక సమ్మెకు శ్రీకారం చుట్టనున్నారు. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు రైతులను(Farmers), స్థానికులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు పాల్గొన్నారు. మరోవైపు పోలీసులు వెల్దండ వద్ద మానవ హక్కుల కార్యకర్తలు ప్రొఫెసర్ హరగోపాల్, గడ్డం లక్ష్మణ్‌లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మైలారం రైతులకు సంఘీభావం తెలిపేందుకు బయల్దేరారు.