07-02-2025 01:21:42 PM
దామరవంచ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో జరిగిన ఫుడ్ పాయిజన్ పై బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్పందించారు. కల్తీ ఆహారం తిన్న విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఒకటి కాదు రెండు కాదు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వందల్లో జరిగాయని, వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కాగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. కల్తీ ఆహారం విద్యార్థులకు పెడితే అరెస్టులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హెచ్చరించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా గురుకులాల తీరు ఉందని మండిపడ్దారు. రేవంత్ రెడ్డి మీ మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప దాటదు అనేందుకు గురుకులాల దీన స్థితే నిదర్శనం అని విరుచుకుపడ్డారు. ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు.