calender_icon.png 25 February, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన హరీశ్ రావు

25-02-2025 06:48:43 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యం పోలీసు రాజ్యమైందని, బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి నాయకుల దాకా అక్రమ కేసులు, వేధింపులు సర్వసాధారణమైపోయాయన్న బీఆర్ఎస్ ఆరోపణలు వాస్తవమని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి కావలి కారుల్లాగా పని చేస్తున్నారని, ఎమ్మెల్యే కేసు పెట్టుమంటే పెట్టాలె, తీసేయమంటే తీసేయాలె అనే స్థాయికి పోలీసులు దిగజారారని చిన్నారెడ్డి మండిపడ్డారన్నారు. గతంలో ఎన్నడూ ఒక ఎమ్మెల్యేకు అధికారులు ఇంతగా భయపడిన దాఖలాలు లేవన్నారు. తన 46 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంత దారుణంగా పోలీసులు, అధికారులు ఎన్నడూ ప్రవర్తించలేదని చిన్నారెడ్డి బహిరంగంగా ప్రభుత్వ తీరును ఎండగట్టారని హరీశ్ రావు తెలిపారు. 

కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్నది నిజమేనని చిన్నారెడ్డి వెల్లడించారు.  నాడు జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నేడు వనపర్తిలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయన్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, ఓట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు రూ.5 నుంచి 10 లక్షల వరకు ఇస్తామని హామి ఇచ్చి రెండున్నర లక్షలు మాత్రమే ఇచ్చారని చిన్నారెడ్డి బట్టబయలు చేసారన్నారు. 

ఈడీలు, సీబీఐలు, ఐటీలు, ఎన్నికల్ కమిషన్లు ఎందుకు ఈ విషయంపై నోరు మెదపడం లేదు..?, సుమోటోగా తీసుకొని కేసులు ఎందుకు పెట్టడం లేదు..? అని హరీశ్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులపై నిరాధారమైన కేసులు పెట్టటంలో చూపించే అత్యుత్సాహం ఆధారాలున్నా, స్వయంగా క్యాబినెట్ ర్యాంకులో ఉండి, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడే చెబుతున్నా ఎందుకు పెట్టడం లేదు? అని అడిగారు. కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా? అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఏ విధంగా సమర్థిస్తారు..? ఏం సమాధానం చెబుతారు..? అని హరీశ్ రావు విమర్శించారు. బడే భాయ్, ఛోటే భాయ్ బంధానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని, బిజేపీ, కాంగ్రెస్ ల చీకటి ఒప్పందానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. వెంటనే కేసులు పెట్టి, విచారణ జరపాలని బీఆర్ఎస్ పక్షాన హరీశ్ రావు డిమాండ్ చేశారు.