28-02-2025 01:41:36 AM
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 27(విజయక్రాంతి): పొలిటికల్ డ్రామా కోసమే మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్ట్‌ను సందర్శించారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు నిధులు తమ జేబులోకి మళ్లించడం కోసమే ప్రాజెక్టులు నిర్మించుకున్నారని, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నాణ్యతగా లేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టే ప్రతిపక్ష హోదాలో ఉన్నవారు కూడా ప్రాజెక్టు వద్దకు రాగలిగారని చెప్పారు. గురువారం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. గతంలో ఆయా ప్రాజెక్టుల్లో జరిగిన ప్రమాదాల్లో అనేకమంది కార్మికులు, అధికారులు బలయ్యారని వారిని పరామర్శించేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా రాక్షసంగా వ్యవహరించి, తమను అడ్డుకున్న సంగతి గుర్తు లేదా అని ప్రశ్నించారు.
దేశ విదేశాల్లో అత్యంత గుర్తింపు పొందిన రెస్క్యూ టీం సభ్యులను మాజీ మంత్రి హరీశ్‌రావు అవమానిస్తున్నారని మండిపడ్డారు. కార్మికులను కాపాడేందుకు వారు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని గుర్తు చేశారు. హెలికాప్టర్ కోసం తాపత్రయ పడే వ్యక్తిని తాను కాదని, తాను పైలెట్‌ని అన్న విషయాన్ని గుర్తురెగాలన్నారు.
కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కొండగట్టు అంజన్న బస్సు ప్రమాదం, మూసాపేట ఘటన, శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కాలేశ్వరం ప్రాజెక్టు ప్రమాద ఘటనల్లో ఒక్కరిని కూడా పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. ఆ కార్మికులను సైతం విస్మరించారని ఫైర్ అయ్యారు. ఎస్‌ఎల్‌బీసీ పనులు వారి హయాంలోనే జరిగాయని చెప్తున్నారని, వారికి అనుమతులు ఎవరు ఇచ్చారో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.