calender_icon.png 28 September, 2024 | 3:02 PM

బుచ్చమ్మ ఆత్మహత్య.. ప్రభుత్వం చేసిన హత్య

28-09-2024 11:28:53 AM

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో హైడ్రా బాధితులతో మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి సమావేశం అయ్యారు. వారి గోడు చూసి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి.. అనాలోచిత నిర్ణయాలతో పాలన చేస్తున్నారని మండిపడ్డారు. బుచ్చమ్మ ఆత్మహత్య.. ప్రభుత్వం చేసిన హత్యే.. అని హరీశ్ రావు ఆరోపించారు. మూసీనదిపై అఖిలపక్షం సమావేశం తర్వాత ముందుకెళ్లాలని కోరారు. కేసీఆర్ పాలనలో ప్రజలను ఇబ్బందిపెట్టలేదని చెప్పారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న అంశంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

ప్రజలు రోగాల బారిన పడుతున్నప్పుడు వాటిపై దృష్టి పెట్టే ఆలోచన సీఎంకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు కూల్చి.. మూసీపై పెద్ద భవనాలకు అనుమతి ఇస్తామంటున్నారని విమర్శించారు. బాధితులకు రక్షణ కవచంలాగా ఉంటాం.. బాధితులకు అండగా ఉంటామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల ప్రచారంలో బుల్డోజర్ రాజ్ నహి చలేగా అంటూ ప్రచారం చేస్తున్నాడు. మరి తెలంగాణలో ఏం అవుతుంది? అని ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణలో కూడా బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది.. ముందు తెలంగాణకు వచ్చి బుల్డోజర్లు ఆపి ఆ తరువాత బుల్డోజర్ రాజ్ నహి చలేగా అంటూ అక్కడ ప్రచారం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.