15-02-2025 01:38:21 AM
ఎవరిని బహిష్కరించాలో ప్రజలను అడుగుదామా?
కొడంగల్ నియోజకవర్గం.. కొండారెడ్డిపల్లికి వెళ్దామా?
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): ‘తెలంగాణ సమాజంలో జీవించే హక్కు కేసీఆర్‌కు లేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ‘తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను రాష్ట్రం నుంచి బహిష్కరిస్తావా ? ఎవరికి జీవించే హక్కు లేదో ప్రజల్నే అడుగుదామా? మీరు ప్రాతినిథ్యం వహించే కొడంగల్ నియోజకవర్గానికి వెళ్దామా ? లేదా కొండారెడ్డిపల్లి గ్రామస్తులను అడుగుదామా ?’ అంటూ హరీశ్‌రావు శుక్రవారం ఓ ప్రకటనలో సీఎంకు సవాల్ విసిరారు. సీఎం వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తూ నే ఉన్నారని, ఆయన దిగజారుడు వ్యాఖ్యలను చూసి ఛీ.. కొడు తున్నారని పేర్కొన్నారు. సీఎం పదవిలో ఉండి నీచమైన వ్యాఖ్య లు తగవని హితవు పలికారు.
ఒకవేళ తెలంగాణ సమాజం బహిష్కరించాల్సి వస్తే, ముందు రేవంత్‌రెడ్డినే బహిష్కరించాల్సి ఉంటుందన్నారు. సీఎం చేయించిన కులగణనను సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారని, సర్వే ఎన్నికల గిమ్మిక్కు.. ఫెయిల్యూర్ జిమ్మిక్కు మాత్రమేనని అభిప్రాయ పడ్డారు. తమ సర్వే నిఖా రైందని చెప్తూనే, మరోవైపు రీ సర్వే చేయిస్తామని ప్రకటించడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. తెలంగాణలో ఫ్యాక్షన్ రాజకీయాలు సఫలం కావని, రేవంత్‌రెడ్డి నోరే ఆయన రాజకీయ జీవితానికి ఉరితాడుగా మారబోతోందని జోస్యం చెప్పారు.