19-02-2025 06:44:04 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధా కిషన్ రావుతో పాటు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో బుధవారం ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తుపై తదుపరి విచారణ చేపట్టే వరకు కోర్టు స్టే విధించింది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తూ రియల్టర్ చక్రధర్ పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చక్రదర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హరీశ్ రావు, రాధాకిషన్ రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ విషయానికి సంబంధించి హరీశ్ రావు వద్ద గతంలో పని చేసిన కంప్యూటర్ ఆపరేటర్‌ను అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని హరీశ్ రావు, రాధాకిషన్ రావు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసుపై విచారించిన హైకోర్టు గతంలోనే హరీశ్ రావు, రాధాకిషన్ రావులను అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వాదనల కోసం లాయర్ సిద్ధార్థ లూథ్రా వస్తారని పీపీ తెలిపారు. ఆయన మరో కేసులో బిజీగా ఉన్నందున వాదనలకు సమయం ఇవ్వాలని పీపీ కోరారు. అయితే తదుపరి విచారణను హైకోర్టు మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.