05-03-2025 07:28:05 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ చేతగానితనం, నిర్లక్ష్యం వల్ల కేంద్రంలో ఉన్న బీజేపీ పక్షపాత ధోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రాన్ని ఎదిరించే దైర్యం లేదని, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదని మండిపడ్డారు. తెలంగాణ నీటి హక్కుల రక్షణ కోసం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కడితే.. రేవంత్ అసమర్ధత, చంద్రబాబు కుట్రలతో కేంద్రంలోని బీజేపీ ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెనక్కి పంపిందని విమర్శించారు. కృష్ణా బేసిన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక నీటిని వాడుకుంటోందని, కేటాయింపుల కన్నా ఏపీ ఇప్పటికే 657 టీఎంసీలు అధికంగా తరలించుకుపోతోందని, తెలంగాణకు మాత్రం 220 టీఎంసీలు మాత్రమే వాడుకున్నదని హరీశ్ రావు చెప్పారు. నిన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కాళేశ్వరం మంచిది. తాను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదని చెప్పినట్లు హరీశ్ రావు గుర్తు చేశారు. అయితే, 2018 జూన్ 13న చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం పట్ల తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కాళేశ్వరంను అడ్డుకోలేదని అంటున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నాయుడు ఢిల్లీలో తన పలుకుబడిని ఉపయోగించి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని, శ్రీశైలం, సాగర్ నుంచి రోజుకు 2 టీఎంసీల తరలిస్తున్నట్లు చెప్పారు. పెన్నా పరివాహకంలో ప్రాజెక్టులు కట్టుకుని కృష్ణా జలాలు తరలించుకుపోతున్నారు. ఒక్క కాళేశ్వరమే కాదు, వారు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కల్వకుర్తి నీటి కేటాయింపులు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాసారు. పాలమూరు ఎత్తి పోతల, డిండి ఎత్తిపోతల పథకాలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాసారని హరీశ్ రావు చెప్పారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయని, చంద్రబాబు సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతం ఇదేనా..? అని ప్రశ్నించారు. రాష్ట విభజనకు ముందే ప్రారంభమైన ప్రాజెక్టులను చంద్రబాబు వ్యతిరేకించారు. సాగర్ ఎడమకాలువ కింద పంట ఎండిపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, చంద్రబాబు కేంద్రంలో తన పలుకుబడి ఉపయోగించి డీపీఆర్ లు వాపస్ వచ్చేలా చేసిండు. రేవంత్ రెడ్డికి బీజేపీని ప్రశ్నించే తెగువ లేదు, తెలివి లేదు అని, రేవంత్ చంద్రబాబును ఎదిరించి ప్రాజెక్టులు సాధిస్తారా, అక్రమ ప్రాజెక్టులను ఆపగలుగుతాడా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.