calender_icon.png 25 October, 2024 | 3:55 AM

హరీశ్‌రావు కండ్లు మండుతున్నయ్

23-07-2024 01:19:41 AM

అన్నదాతల కండ్లల్లో ఆనందం సూడలేకే ఈ విమర్శలు 

ప్రభుత్వ విప్ ఐలయ్య

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): తెలంగాణ రైతుల కళ్లల్లో ఆనందం చూసి హరీశ్ రావు కండ్లు మండుతున్నాయని.. ఓర్వలేకే అర్థం, పర్థం లేని విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండిపడ్డారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ..  రైతులను తప్పుదోవ పట్టించడానికే సీఎం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, కాళేశ్వరం పాపం ఎవరిదో ప్రజలకు తెలుసనే సంగతి మరిచిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం మరమ్మతులు చేయలేదని, విమర్శలు చేయడం సరికాదని, లక్షన్నర కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మును గోదారి పాలు చేసిన ఘనత కేసీఆర్, హరీష్‌రావులదేనన్నారు. 

అక్టోబర్ 23న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేడిగడ్డ కుంగిపోయిందని, కుంగిన ప్రాజెక్టు గురించి వీరిద్దరూ ఏనాడు మాట్లాడలేదని ఆరోపించారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి హరీశ్‌రావు చవకబారు విమర్శలు చేస్తున్నాడని, ప్రజాపాలన చూసి ఓర్వలేక ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరడుగుల హరీశ్‌రావు మెదడు తలలో ఉందా, మోకాళ్లలో ఉందో అర్థం కావడంలేదన్నారు.  గోదావరిలోకి ఎగువ నుంచి భారీ ఎత్తున వరద నీరు వస్తుంటే మేడిగడ్డలో నిల్వ చేసే పరిస్థితి లేదని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా మేడిగడ్డలో నిల్వచేయవద్దని హెచ్చరించారని తెలిపారు. అర్హులైన రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పినా ఇలా విమర్శలు చేయడం సబబుకాదన్నారు. రేపోమాపో హరీశ్‌రావు బీజేపీ లోకి వెళ్లడం ఖాయమని, కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామని, ప్రతిపక్ష నాయకుడిగా గౌరవిస్తామని పేర్కొన్నారు.