హైదరాబాద్: ఎల్ఆర్ఎస్(Land Regularization Scheme) పేరిట ప్రభుత్వం రూ. వేల కోట్లు వసూలు చేయాలని చూస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Thanneeru Harish Rao) ఆరోపించారు. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తామని చెప్పారని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ పైన నాడు అడ్డగోలుగా విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ(Congress party) నేడు అధికారంలోకి రాగానే అసలు రంగు బయటపెట్టిందన్నారు. డబ్బులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎల్ఆర్ఎస్ పేరిట డబ్బులు దండుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్న కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ (LRS) ఉచితంగా అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజల నుంచి సొమ్మును దండుకునే కార్యక్రమానికి తెర లేపడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ(Bharat Rashtra Samithi) తరుపున డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ త్వరలో పుంజుకుంటుందని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించడం అంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందనే కదా అర్థం అన్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన వలన రియల్ ఎస్టేట్(Real estate) కుదేలైందని తాము ముందు నుండే చెప్తుంటే బుకాయిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారు ? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దాడులు చేయడం మానేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. దారి తప్పిన పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేయండని హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు.