హైదరాబాద్: పేదలకు రేషన్ కార్డులు అందకుండా చేస్తున్నారని, కోతలు విధిస్తున్నారని ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయడంతో పాటు, పత్రికా సమావేశం నిర్వహించి నిలదీస్తే గాని ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కాలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(BRS MLA Tanniru Harish Rao) పేర్కొన్నారు. కుల గణన దరఖాస్తులతోపాటు, ప్రజాపాలన దరఖాస్తుల(Praja Palana Application )కు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం, ఇది తుది జాబితా కాదని, దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చెప్పించడం బీఆర్ఎస్ పార్టీ విజయం అన్నారు.
ఆదాయ పెంపు విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండటం వల్ల లక్షల మంది నిరుపేద వర్గాలు రేషన్ కార్డులకు దూరం అవుతాయని మరొక్క సారి గుర్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్(KCR) అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు(Ration card) పొందేందుకు వీలుగా ఆదాయ, భూ పరిమితి నిబంధనల్లో మార్పులు చేశారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదాయ పరిమితి గ్రామీణంలో 60వేలు, పట్టణంలో 75వేలు ఉంటే, దాన్ని గ్రామీణంలో లక్షా 50వేలకు, పట్టణంలో 2.50 లక్షలకు పెంచారని, మాగాణి రెండున్నర ఎకరాలు, మెట్ట 5ఎకరాలుగా ఉన్న పరిమితిని మాగాణి మూడున్నరకు, మెట్ట ఏడున్నర ఎకరాలకు పెంచారని తెలిపారు.
దీనివల్ల లక్షల మంది నిరుపేదలకు రేషన్ కార్డు పొందే అర్హతను కేసీఆర్ ప్రభుత్వం(KCR Govt) కల్పించిందన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయ పరిమితి తోపాటు భూ పరిమితి పెంచుతూ నిబంధనల్లో మార్పు చేయాలని తెలంగాణ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తద్వారా ఆశాలు, అంగన్వాడీలు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, జర్నలిస్టులు.. ఇతర అల్ప ఆదాయ వర్గాలు, పెదాలు రేషన్ కార్డులు పొందే వీలు ఉంటుందని స్పష్టం చేశారు.
పల్లెల్లో అయినా పట్టణంలో అయినా కూలీ ఎక్కడైనా నిరుపేదే. కాబట్టి పల్లెలు పట్టణాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం(Indiramma Atmiya Bharosa Scheme) వర్తింపజేయాలని, 20 రోజుల పనిదినాల నిబంధన తొలగించాలని, భరోసా పథకాన్ని ఉపాధి హామీకి లింకు చేయకుండా అర్హులైన అందరికీ వర్తింప చేయాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. నిరుపేదలకు ఆసరాగా ఉండే రేషన్ కార్డు జారీ ప్రక్రియలో ప్రభుత్వం కోతలు విధించడం సరికాదని హితవు పలికారు.