హైదరాబాద్,(విజయక్రాంతి): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల పాఠశాల విద్యార్థిని శైలజకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు కన్నీటి నివాళి అర్పించారు. నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందిన శైలజ సోమవారం పరిస్థితి విషయమించి మృతి చెందింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి శైలజ ప్రాణాలు బలైపోయయాని మండిపడ్డారు. తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ బాలిక విషాహారం తిన్ని మరణించడం కలచివేస్తోందని, రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం గిరిజన బిడ్డకు శాపంగా మారిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
శైలజ తల్లిదండ్రులకు ప్రభుత్వం భరోసా ఇవ్వడంలో విఫలమైందని, వారికి గుండెకోతను మిగిల్చిందన్నారు. చివరకు ఆ విద్యార్థిని చావును కూడా ప్రభుత్వం దాచేందుకు దొంగ చాటున విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలిచేందుకు యత్నించిందని మండిపడ్డారు. గిరిజన విద్యార్థినీ కుటుంబానికి ప్రభుత్వం బాధ్యత వహించిన రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.