01-03-2025 03:26:57 PM
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతల దాడి దుర్మార్గం
కొల్లాపూర్ లో బీఆర్ఎస్ శ్రేణులపై దాడిని ఖండించిన హరీశ్
హైదరాబాద్: ఏడాది కిందటి వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హింస, నేరాలు పెరిగిపోతున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గం(Kolhapur Constituency) లోని నార్యనాయక్ తండాలో తాజాగా బీఆర్ఎస్ కేడర్ పై జరిగిన దాడే దీనికి నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులను ఉసిగొల్పుతూ నిజంగానే మార్పు తెచ్చారు. కాంగ్రెస్ మార్క్ ఎమర్జెన్సీ ని ఆ పార్టీ కొల్లాపూర్ లో అమలు చేయిస్తోందని ద్వజమెత్తారు. కొల్లాపూర్ లో బీర్ఎస్ శ్రేణులపై దాడిని హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. సాతాపూర్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడి జరిగి ఒక రోజు గడవక ముందే నార్యానాయక్ తండా(Narya Naik Tanda Village)లో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు గర్హనీయమన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుల దాడులు పెరిగిపోతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకునే హక్కు ప్రతిపార్టీకి ఉంటుందని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంకోసం పోరాటం చేయడం ప్రతిపక్షాల కర్తవ్యమన్న హరీశ్ రావు, బీఆర్ఎస్(Bharat Rashtra Samithi ) ఈ పనులు చేస్తుంటే కాంగ్రెస్ కు జీర్ణం కావడం లేదన్నారు. తమ వైఫల్యాలు ప్రజలకు తెలిస్తాయని భయపడుతూ దాడులుకు పాల్పడుతున్నదని విమర్శించారు బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ.. ఇలాంటి ఎన్నో అణచివేతలను ఎదుర్కొని నిలిచిందని గుర్తుచేశారు. దాడులకు, కేసులకు మా కార్యకర్తలు భయపడరన్న ఆయన బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందన్నారు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుని తమ కర్తవ్యం నిర్వహించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.