హైదరాబాద్,(విజయక్రాంతి): లగచర్ల గ్రామస్థులను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. ప్రభుత్వ తీరు అమానుషం అని, అరెస్టు చేసిన లగచర్ల వాసులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం అర్థరాత్రి 300 మంది పోలీసులు లగచర్ల గ్రామానికి చేరుకొని వారిని అరెస్టు చేయడం దారుణమన్నారు. ఫార్మా భూసేకరణకు నిరాకరించిన వాళ్లను పోలీసులతో బెదిరించలని చూడడం దారుణమని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్థరాత్రి పోలీసులతో ధమనకాండ నిర్వహించడం సరికాదని హరీశ్ రావు మండిపడ్డారు. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా భూసేకరణ చేయడం వెనుక ఉన్న ముఖ్యమంత్రి ఉద్దేశ్యం తెలియాలని వ్యాఖ్యానించారు. సీఎం వ్యక్తిగత లబ్ధి కోసం చేపడుతున్న భూసేకరణను నిలిపివేయాలని కోరారు. పోలీసులు అదుపులో ఉన్న గ్రామస్థులను, రైతులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.