calender_icon.png 8 November, 2024 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్గొండలో అక్రమ అరెస్టులను ఖండిస్తున్నా: హరీశ్ రావు

08-11-2024 10:53:55 AM

పాదయాత్ర కావు.. పాప పరిహారయాత్ర చేసిన కాంగ్రెస్ పాపం పోదు

కూల్చింది ఒకచోట.. పాదయాత్ర మరోచోట

హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేయాలి

హైదరాబాద్: ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి సహా ఇతర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన మీ పాదయాత్రకు ప్రజల మద్దతు లభించదన్నారు.  ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.  మూసీ మురికి కూపంగా మారడానికి మీ 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కదా..? పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర చేసినా మీ కాంగ్రెస్ పార్టీ పాపం పోదు రేవంత్ రెడ్డి..? అన్నారు. 


పేదల గూడు కూల్చింది ఒక దగ్గర, మీ పాదయాత్ర మరొక దగ్గర అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  హైదరాబాదులో ఇండ్లు కూల్చి, నల్లగొండలో పాదయాత్ర చేస్తారా..? అని ప్రశ్నించారు. దమ్ముంటే.. హైదరాబాద్ నుండి మీ పాద యాత్ర మొదలు పెట్టండని డిమాండ్ చేశారు. మీ పాదయాత్రకు ప్రజల మద్దతే ఉండి ఉంటే, ఈ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎందుకు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు.  మీ 11 నెలల పాలనే కాదు, మీ పాదయాత్ర కూడా నిర్బంధాల మధ్య కొనసాగుతుండడం దురదృష్టకరమని విమర్శించారు. అరెస్టులు, అక్రమ నిర్బంధాలు చేసిన మా పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు. కనీసం మీరు పుట్టిన ఈ ఒక్క రోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించాలని కోరుకుంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.