calender_icon.png 12 March, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశ లేదు

12-03-2025 02:28:18 PM

హైదరాబాద్: గతేడాది గవర్నర్ ప్రసంగానికి, ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Thanneeru Harish Rao) ఆరోపించారు. గవర్నర్లు మారారు తప్ప, ప్రసంగాలు మారలేదని ఆరోపించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లు.. ఇట్ల అబద్దాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం(Telangana Congress Government) గవర్నర్ తో చెప్పించిందని విమర్శించారు. ఏడాదిన్నర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనమన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాల ప్రచారాన్ని నమ్మించేందుకు గవర్నర్ ని కూడా వాడుకోవడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. గవర్నర్  మహాత్మ గాంధీ చెప్పిన మాటలతో 32 పేజీల ప్రసంగం మొదలు పెట్టారు. "నిన్ను నువ్వు కనుగొనడానికి అత్యుత్తమ మార్గం ఇతరుల సేవలో నిమగ్నమవ్వడమే" అని అన్నారు. నిజానికి రేవంత్ రెడ్డి అత్యుత్తమ మార్గం డిల్లీ సేవలో, చంద్రబాబు(Chandrababu) సేవలో నిమగ్నం అయ్యాడని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని హరీశ్ రావు సూచించారు.

ట్రాన్స్ ఫార్మింగ్ లైవ్స్ అన్నరు. ఎవరి లైవ్స్ ట్రాన్న్ ఫార్మ్ చేసారు. లగచర్ల, న్యాల్కల్, అశోక్ నగర్ లో రైతులను, నిరుద్యోగులను పోలీసులతో కొట్టించడం, ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఇదేనా మీరు చెప్పిన ట్రాన్స్ ఫార్మింగ్ లైవ్స్ అని ప్రశ్నించారు. ఇవ్వాళ కూడా ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసి ప్రజాపాలన పేరిట పెద్ద ట్రాన్స్ ఫర్మేషన్ చేసారని మండిపడ్డారు. ఇంక్లూసివ్ డెవలప్ మెంట్(Inclusive development) అంటే అన్ని వర్గాల ప్రజల డెవెలప్మెంట్ కావాలి, అంతే గానీ కాంగ్రెస్ మంత్రులు, నాయకుల డెవలప్మెంట్ కాదు, డిల్లీ డెవలప్ మెంట్ కాదని చురకలంటించారు. 20శాతం కమిషన్లు తీసుకోవడమేనా మీరు చెప్పిన ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అన్న హరీశ్ రావు ప్రజల సేవ ఎక్కడిది, రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం స్వయం సేవా, ఢిల్లీ సేవలో తరిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు. తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli Statue) పెట్టే చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టారు. తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి చేపట్టిన చర్యలుగా భావించాలా?, వ్యవసాయం పెంచింది ఎవరు? గొప్పలు చెబుతున్నరు. 34లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాల మాగాణంగా మార్చింది కేసీఆర్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వల్ల అది సాధ్యమైందన్నది వాస్తవం కాదా అన్నారు. గొప్పగా చెప్పిన 260 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రికార్డు కేసీఆర్ పదేళ్ల కృషితో సాధ్యమైందా, మీ ఏడాదిన్నర పాలనలో సాధ్యమైందా? అన్నారు.

రుణమాఫీ అనేది పెద్ద బోగస్

రుణమాఫీ(Loan waiver) అనేది పెద్ద బోగస్ అన్న హరీశ్ రావు 49వేల కోట్ల రుణమాఫీ అన్నరు. బడ్జెట్ లో 31 వేల కోట్లు చెప్పి, 20వేల కోట్లు అని ప్రచారం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రైతు భరోసా 15వేలు ఇస్తమని, సిగ్గులేకుండా 12వేలకు తగ్గించి దాన్ని గొప్పగా గవర్నర్ ప్రసంగంలో చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. రైతు కూలీలకు 12వేలు ఇస్తున్నమని పచ్చి అబద్దం చెప్పించారు. ఇప్పటి వరకు కనీసం ఒక్క రూపాయి అయినా ఎవరి ఖాతాల్లో అయినా పడిందా?, అసలు 566 రైతు వేదికలు కట్టింది ఎవరు. అది కూడా  మీ ఘనతేనా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) చేసింది కూడా కేసీఆర్ ముందే మీ ఘనత గా చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. చేనేతలకు ఉన్న పథకాలన్నీ రద్దు చేసి.. వాళ్లను బలహీనం చేసి దెబ్బతీసి.. ఇప్పుడు కొత్త పథకాన్ని ప్రకటించారు. రుణమాఫీ, రైతు భరోసాలాగానే ఈ పథకం అమలూ అంతేనా? అన్నారు. అన్ని పంటలకు బోనస్ అని చెప్పి సన్నాలకు పరిమితం చేసారు. ఇంకా 400  కోట్లు పెండింగ్ ఉందన్నారు. 1200 కోట్లు ఇచ్చినం అనేది పచ్చి అబద్దమని ఆయన స్పష్టం చేశారు. మీరు ఏర్పాటు చేసిన వ్యవసాయ కమిషన్ ఏం చేసిందన్న హరీశ్ రావు యాసంగిలో పంటలు వేయకండని చెప్పింది అంతకు మించి చేసిన పనేంటన్నారు. 445 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. కనీసం రైతు బీమా డబ్బులు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కృష్ణా జలాల గురించి గొప్పలు చెబుతున్నరు

కృష్ణా జలాల(Krishna waters) గురించి గొప్పలు చెబుతున్నరు. కృష్ణా జలాలు ఆంధ్రా దోచుకుపోతుంటే మౌనంగా ఉన్న మీరు దాని గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి మొదటి హామీ నెలకు 2500 ఇప్పటికి దిక్కులేదన్నారు. ఇంకా దీన్ని గేమ్ చేంజర్ అని చెప్పుకుంటున్నారని తెలిపారు. ఎస్ జీ హెచ్ లకు ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని విమర్శించారు. 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినం అని అబద్దం చెప్పారు. పది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్(Job calendar) ను జాబ్ లెస్ క్యాలెండర్ చేసారు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఏటా 2లక్షల ఉద్యోగాలని యువతను మోసం చేసారని వెల్లడించారు. విద్యావ్యవస్థ(Education system) నిర్వీర్యం చేసారు. గురుకులాల్లో 83 మంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారని సూచించారు. ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదు, పోలీసు భద్రత అమలు కావడం లేదు కానీ గొప్పలు మాత్రం చెప్పుకుంటున్నారన్నారు. సామాజిక న్యాయం.. బీసీలకు న్యాయం కోసం 42శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం బిల్లు పెడుతున్నారని పేర్కొన్నారు. బీసీల కులగణన తప్పుల తడకగా చేసి.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన బిల్లు పెడతారు?, తప్పుల కులగణన చేసిన రోజును సామాజిక న్యాయ దినోత్సవంగా ఎలా జరుపుతారని హరీశ్ రావు ప్రశ్నించారు.