హైదరాబాద్: మెదక్ జిల్లా కొచ్చారం మండలం చిన్నఘనపూర్ లో తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... సమస్యలు గాలికి వదిలి మంత్రులు, సీఎం గాల్లో తిరుగుతున్నారు. మూసీ కాలుష్యానికి కారణం కాంగ్రెస్, టీడీపీ చేసిన పాపమే అన్నారు. మూసీ నదిపై పాదయాత్ర కాదు.. పాపయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. మూసీనది సమస్యలపై పాదయాత్రకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న కేటీఆర్ పై కేసులకు కుట్ర చేస్తున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ప్రజాబలంతోనే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటామన్నారు. కేసీఆర్ పై మంత్రి కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. యాదాద్రి మరింత అభివృద్ధికి సీఎం.. నిధులు కేటాయించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.