హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుందన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ కేజీబీవీ పాఠశాలలో ఈ బువ్వ మేము తినలేము, తామను ఇంటికి తీసుకెళ్లండంటూ పిల్లలు తల్లిదండ్రులను వేడుకుంటున్నారు. మరోవైపు అనంతపేట్ కేజీబీవీ పాఠశాలలో విషాహారం తిని పదిమంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన దుస్థితి ఏర్పాడిందని హరీశ్ రావు మండిపడ్డారు.
విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరువకముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటని విమర్శించారు. ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం క్యూ కట్టేవారని, ప్రస్తుతం గురుకులాల నుంచి ఇంటి బాట పట్టేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఊదరగొట్టిన మార్పు ఇదేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు ప్రాణాలతో బ్రతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఈ బువ్వ మాకొద్దు, ఇక్కడ మేము ఉండలేము అని విద్యార్థులు వేడుకుంటున్నారు.
కన్నబిడ్డల ఆవేదన చూడలేని తల్లిదండ్రులు గురుకులాలకు వచ్చి బిడ్డలను తోలుకపోతున్నారు. ఏడాదిలో కాంగ్రెస్ పాలన వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? అని విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉండి భావి భారత పౌరుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని, కాంగ్రెస్ చేతగాని పాలన గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి, విద్యార్థుల ప్రాణాలను కాపాడే చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.