హైదరాబాద్: అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు... ఇందిరమ్మ రాజ్యమా..? పోలీస్ రాజ్యమా..? అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును మాజీ మంత్రి ఖండించారు. ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు.సెలవు రోజుల్లో కావాలని తమ నేతలను అరెస్ట్ చేస్తూ, సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హోం మంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి, మీ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు తాము భయపడేది లేదని, తెలంగాణ సమాజమే మీకు తగిన బుద్ధి చెబుతుందని హరీశ్ రావు పేర్కొన్నారు.