హైదరాబాద్: అభయహస్తంలో మొదటి హామీనే మహిళలకు రూ. 2500.. 11 నెలలు అవుతుంది మహిళలకు డబ్బులు ఇచ్చారా..? అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హామీలు అమలు చేశామని మహారాష్ట్ర వెళ్లి చెప్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే రుణమాఫీ చేస్తామన్నారు.. చేశారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్ సైట్ లో అబద్దాలు పెట్టారని తెలిపారు. 40 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేశామని కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలోనే పోస్టు చేశారు. 20 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేశారు.. ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ చేయాలని సూచించారు . కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. ఆలస్యంగా చేసిన రుణమాఫీ వల్ల రైతులు వడ్డీ కట్టాల్సి వచ్చిందన్నారు. మహారాష్ట్రలో మాత్రం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రైతు భరోసా ఇస్తామన్నారు.. ఇచ్చారా?, రైతు కూలీలకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని ప్రశ్నించారు. వరి పంటకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని మహారాష్ట్రాలో చెప్పారు. ఇప్పుడున్న సన్న బియ్యానికే రూ. 500 బోనస్ ఇస్తామంటున్నారు. వరి పండించిన రైతులకు ఎవరికైనా బోనస్ వచ్చిందా? అని ప్రశ్నించారు. 11 నెలల్లో రేవంత్ రెడ్డి కట్టిన ఒక్క ఇల్లు చూపించమని హరీశ్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇల్లు కట్టలేదు.. ఇళ్లు కూలుస్తున్నారని హరీశ్ మండిపడ్డారు. పింఛన్లు పెంచి ఇస్తామని చెప్పారు.. ఇచ్చారా? అన్నారు.