- పీసీఘోష్ కమిషన్ నుంచి పిలుపు?
- సాగునీటి నిపుణులతో సమాలోచనలు
- కేసీఆర్‌కు సైతం పిలుపు వచ్చే అవకాశం!
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వ్యవహరించిన హరీశ్‌రావుకు సైతం త్వరలో కాళేశ్వరం కమిషన్ నుంచి విచారణకు పిలుపువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రిటైర్డ్ ఇంజినీరింగ్ అధికారులు, సాగునీటి నిపుణులతో చర్చించారని సమాచారం.
కమిషన్ అడిగే ప్రశ్నలు దానికి ఇవ్వాల్సిన సమాధానాలపై ఆయన సమాలోచన చేసినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ ఇప్పటివరకు జరిగిన విచారణ సందర్భంగా సీఈ సుధాకర్‌రెడ్డి.. అప్పటి సాగునీటి శాఖ మంత్రి అయిన హరీశ్‌రావు పేరును ప్రస్తావించారు. ఆయన ఆదేశాల మేరకు పనులు చేసినట్టు తెలపడమే కాకుండా అఫిడవిట్ కూడా దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలోనే తనకు పిలుపు తప్పదని హరీశ్‌రావు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు హరీశ్‌రావు విచారణ ముగిసిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అంతా తానే అయి వ్యవహరించిన మాజీ సీఎం కేసీఆర్‌కు సైతం పిలుపు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
విచారణ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు పలుమార్లు మాజీ సీఎం పేరును సైతం ప్రస్తావించారు. దీంతో ఆయనకు కూడా విచారణ తప్పదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న తిరిగి ప్రారంభం కానున్న కాళేశ్వరం కమిషన్ విచారణపై అందరూ దృష్టి సారించారు.