- వారిద్దరూ ఒకే పార్టీలో ఉండే పరిస్థితి లేదు
- తన రాజకీయాల కోసం కేసీఆర్‌ను నిర్బంధించిన కేటీఆర్
- త్వరలోనే కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
- పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌లో హరీశ్‌రావు, కేటీఆర్‌కు పొసగడం లేదని తమకు సమాచారం ఉందని, భవిష్యత్తులో వీరిద్దరూ ఒకే పార్టీలో ఉండబోరని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క స్థానం కూడా గెలువకపోవడంతో ఆ పార్టీకి భవిష్యత్తు లేదని తేలిపోయిందన్నారు.
వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ కనుమరుగై రాష్ర్టంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీనే ఉంటాయని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీలో కలిసిపోవడం ఖాయమని, లేదంటే మెజార్టీ బీఆర్‌ఎస్ నాయకులు బీజేపీలో కలిసిపోతారని తెలిపారు. కేసీఆర్ ఎవరి ఒత్తిడితో బయటకు రావడంలేదో చెప్పాలని ప్రశ్నించారు.
కేటీఆర్ తన రాజకీయాల కోసం ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ను నిర్బంధించారని ఆరోపించారు. త్వరలోనే కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని చెప్పారు. తమ పార్టీలో చేరేందుకు చాలామంది ఎమ్మెల్యేలు ఆసక్తితో క్యూలో ఉన్నారని, కానీ తామే తుది నిర్ణయం తీసుకోవడంలో సమాలోచనలు చేస్తున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలు చేరిన చోట కొత్త, పాత నేతల మధ్య ఇబ్బందులు ఉన్నాయని, వాటిని సరిచేస్తామని వెల్లడించారు. కొత్త ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చి చేరినా పార్టీలో పదవులు, ప్రాధాన్యం పాత నేతలకే ఉంటుందని స్పష్టంచేశారు. కొత్త ఎమ్మెల్యేల అనుచరులు పదవుల కోసం కొంచెం ఆగాల్సిందేనని తెలిపారు.
మంత్రివర్గ విస్తరణపై సంప్రదింపులు పూర్తయ్యాయని, శనివారం నుంచి జిల్లాల్లో తన పర్యటన ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని, పార్టీ నేతలు, ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, తమ ఏడాది పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు.
కేటీఆర్ తప్పు చేసినట్టు ఫీలవుతున్నారని, ఫార్ములా వన్ విషయంలో చేసిన తప్పేంటో కేటీఆర్‌కు తెలుసని పేర్కొన్నారు. అందుకే తాను జైలుకు పోతానంటూ రాగం తీస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబాన్ని ఇంకా జైలుకు ఎందుకు పంపడం లేదని ప్రజల్లో సందేహాలున్నాయని, చట్టప్రకారమే చర్యలు ఉంటాయని తెలిపారు. బీఆర్‌ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని... ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.