calender_icon.png 20 October, 2024 | 5:28 AM

హరీశ్.. ఎల్బీ స్టేడియంలో నేనే చర్చకు వస్తా

20-10-2024 02:50:11 AM

  1. బఫర్ జోన్‌లో నా ఇల్లు కూడా పోతుంది
  2. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కావాల్సిందే
  3. మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌పై చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వస్తానంటూ బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని.. దీనికి సీఎం అవసరం లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

ఎల్బీ స్టేడియంలో చర్చ పెడదామని.. నేనే ఆ చర్చకు వస్తానంటూ జూపల్లి హరీశ్‌కు కౌంటర్ ఇచ్చారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠను దిగజార్చడానికి హరీశ్‌రావు, కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మూసీరివర్ ఫ్రంట్‌లో రూ.1.50 లక్షల కోట్ల దోపిడి జరిగిందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

బావాబామ్మర్దుల తీరు ఈస్ట్ట్‌మన్ కలర్ సినిమాను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణను మొత్తం దోచుకుంది వాళ్లేనని, రాజకీయంగా దివాలా తీసిన వీరి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత పదేళ్లలో ఎవరెవరు ఎంతెంత దోచుకున్నారో అనే దానిపై చర్చకు సిద్ధమా అని జూపల్లి సవాల్ విసిరారు. ఎల్బీ స్టేడియంలో మీడియా సమక్షంలో 50 వేల మంది ప్రజల మధ్య చర్చ చేద్దామని జూపల్లి అన్నారు.

బీఆర్‌ఎస్ అవినీతిపై తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. ఆధారాలతో సహా అక్రమాలు, దోపిడీని రుజువు చేస్తానన్నారు. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కప్పం కడతున్నాడంటూ కామెంట్ చేసిన బీఆర్‌ఎస్ నేతలు.. కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు అప్పనంగా ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు.

అధికారం కోల్పోయ్యి 10 నెలలు అవుతున్నా వారింకా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 2016లో మూసీనదికి సంబంధించి బఫర్‌జోన్‌ను నిర్ధారించారని, జీవో నెంబర్ 7 అప్పుడే మరిచిపోయారా అని ప్రశ్నించారు. బఫర్ జోన్‌లో నా ఇల్లు కూడా పోతుందని, అయినా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ కావాల్సిందేనని అభిప్రాయపడ్డారు.