calender_icon.png 25 September, 2024 | 11:46 PM

శ్రీలంక ప్రధానిగా హరిణి

25-09-2024 04:20:15 AM

  1. మూడో మహిళా ప్రధానిగా రికార్డు
  2. మంత్రులుగా మరో ఇద్దరి ప్రమాణ స్వీకారం

కొలంబో (శ్రీలంక), సెప్టెంబర్ 24: శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య మంగళవారం ప్రమాణ స్వీకా రం చేశారు. నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్‌పీపీ)కి చెందిన అమరసూర్య ఈ పదవిని చేపట్టిన 16వ వ్యక్తిగా, మూడో మహిళగా రికార్డు సృష్టించారు. కాగా హరిణి ఎన్‌పీపీ నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు.

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన కార్యక్రమంలో హరిణితో దేశ అధ్యక్షుడు దిసనాయకే ప్రమాణం చేయించారు. ఆమెతో పాటు మరో ఇద్దరు సభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా హరిణి శ్రీలంకలో హక్కుల కార్యకర్తగా, యూనివర్సిటీ అధ్యాపకురాలిగా పనిచేయడంతో పాటు సామాజిక న్యాయం, మహిళలకు విద్య అందించడం కోసం ఎంతో కృషి చేశారు.

ఈ క్రమంలో ఆమె ప్రధానిగా ఎన్నిక కావడంతో సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ప్రస్తుత పార్లమెంట్‌ను రెండు రోజుల్లో రద్దు చేస్తామని ఆయన ప్రకటించిన నేపథ్యంలో నవంబర్‌లో శ్రీలంక పార్ల మెంట్‌కు ఎన్నికలు(ముందస్తు) జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన తన ప్రధాని పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

భారత్, చైనా మధ్య నలిగిపోం

ఇండియా, చైనా మధ్య తాము నలిగిపోదల్చుకోలేదని శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే స్పష్టం చేశారు. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విదేశాంగ విధానంపైన తన వైఖరిని స్పష్టంగా తెలిపారు. ‘భౌగోళిక రాజకీయ శత్రుత్వాల మధ్య చిక్కుకొనే పరిస్థితులకు శ్రీలంక వీలైనంత దూరంగా ఉంటుంది. తాము ఓ వర్గం పక్షం వహించం.

భారత్, చైనాతో సంబంధాలను మా ప్రభుత్వం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. ఇరుదేశాలు మాకు విలువైన మిత్రులే. ఇదే సమయంలో ఐరోపా, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నాం’ అని దిసనా యకే స్పష్టం చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తటస్థ విదేశాంగ విధానం అవలం భించనున్నట్లు తెలుస్తోంది