calender_icon.png 11 January, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనిపించని హరిదాసులు - వినిపించని సంకీర్తనలు

11-01-2025 07:37:01 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): సంక్రాంతి పర్వదినం సందర్భంగా పల్లెటూర్లలో కనిపించే హరిదాసులు కనుమరుగయ్యారు. సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చే వాటిలో హరిదాసులు ఒకరు. సంక్రాంతి పండుగ నెల పొడవునా గ్రామీణ ప్రాంతాల్లో వీరు దర్శన ఇస్తారు. అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలతో పాటు కనిపించే హరిదాసులు కాలగమనంలో దూరమయ్యారు. మానవ నాగరికత ఆవిర్భ వించినప్పటి నుండి హరిదాసులు సంక్రాంతి పండుగ వేళ దర్శనం ఇవ్వడం అరుదు. తెలుగు గొప్పదనాన్ని సంకీర్తనలతో తెలియజేయడం హరిదాసుల ప్రాముఖ్యతను అంతరించుకుంటుంది. తెలుగువారికి అన్ని పండుగలలో సంక్రాంతి పర్వదినం అతి ముఖ్యమైనది. ఏడాది పొడవునా కష్టించిన వంట లక్ష్మిని ఇంటికి తెచ్చుకున్న కష్టజీవులైన రైతులందరూ ఆనందోత్సవాల నడుమ జరుపుకునే పండుగగా భావిస్తారు.

సంవత్సరములో ఎప్పుడూ కనిపించని హరిదాసులు ధనుర్మాసంలోనే దర్శనమిస్తారు. నెల రోజులపాటు భక్తి పాటలతో ఇంటింటిని పావనం చేస్తారు. తెల్లవారగానే స్నానమాచరించి కాషాయ వస్త్రాలను ధరించి ముఖముపై నామాలు దిద్దుకుని మెడలో పూలదండను రుద్రాక్ష మాలలను ధరించి నెత్తి మీద నామాలతో అలంకరించిన అక్షయపాత్రను తలపై పెట్టుకుని భుజం మీద తంబురాను మీటుతూ ఒక చేత్తో చిడతలతో తాళం వేస్తూ శ్రావ్యంగా పాటలు పొడుతూ కాళ్ల గజ్జలతో నృత్యం చేస్తూ హరిలోరంగ హరి అంటూ ప్రతి ఇంటి ముంగిట దర్శనమిస్తారు. అటువంటి హరిదాసుకు ఇల్లాలు లేదా పిల్లలు ఫల పుష్పాదలతో దోసెడు బియ్యం తీసుకువస్తే హరిదాసు వినమ్రతతో మోకాలుపై కూర్చుని అక్షయపాత్రలో వేయించుకుని ఆ ఇంటి కుటుంబాన్ని దీవిస్తారు. ఇలా ఒక్కరితోపాటు మరి కొంతమంది హరిదాసులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో తిరగడం వల్ల పల్లెటూర్లు కోలాహలంగా కనిపిస్తాయి.

ఇలా నెలరోజులపాటు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి సంవత్సరానికి సరిపడా బిక్షాన్ని సంపాదించుకోవడం వారి జీవనశైలికి పడుతుంది. వారికి కేటాయించిన గ్రామాలకే పరిమితమవుతారు. ఇలా నెల పొడువునా హరిదాసుల గ్రామంలో ఉండటం వల్ల వారి పాటలతో సందడి నెలకొంటుంది. బాల బాలికలు కూడా ఉత్సాహంగా పోటీపడుతూ హరిదాసులా వ్యవహరిస్తారు. హరిదాసుల వలె ప్రతిసారి కూర్చొని లేవడం కష్టమైన భక్తి భావంతో ఆడుతూ అలసటను మరచిపోతారని పెద్దలు చెబుతున్నారు. ఇలా జానపద కళాకారులతో కన్నుల పండుగగా సంక్రాంతి పర్వదినాలు ముగుస్తాయి. పంటను ఇంటికి తెచ్చుకున్న కలలాడే రైతు కుటుంబాలు సంక్రాంతి శోభతో అందరినీ ఆదరిస్తారు. మరి చాలామంది హరిదాసులు కాలగమనంలో కరువయ్యారు. ఏదో అక్కడక్కడ తప్పిస్తే మరి ఎక్కడ వారి ఆచూకీ లేకుండా పోయింది. సంక్రాంతి పండుగకు శోభ తెచ్చే హరిదాసులు రావాలని పండుగ పూర్వ వైభవం సంతరించుకోవాలని ఆశిద్దాం.