calender_icon.png 26 February, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా గుండెను ముల్లేగట్టినాదిరో..

25-02-2025 12:00:00 AM

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు పార్ట్ స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రా జ్యం నేపథ్యంలో పీరియడ్ యాక్ష న్ డ్రామాగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. బాబీ డియోల్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు వివిధ పాత్రలు పోషిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణ లో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్‌రావు ఈ చిత్రా న్ని నిర్మిస్తున్నారు.

ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’ గీతానికి మంచి స్పందన వచ్చిందని మేకర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో వారు సోమవారం రెండో పాటను విడుదల చేశారు. ‘కొల్లగొట్టినాదిరో’ అనే ఈ పాటలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ నృత్యం చేస్తూ కనిపించటం ఈ పాటకు అదనపు ఆకర్షణగా మారింది. 

‘కోర కోర మీసాలతో కొదమ కొదమ అడుగులతో.. కొంటె కొంటె చెనుకులతో.. కొలిమిలాంటి మగటిమితో.. చిచ్చరపిడుగయ్యినాడు.. ఏదో ఏదో తలచినాడు.. ఎవరినో వెతికినాడు..’ అంటూ సాగుతున్న ఈ పాట సాహిత్యం గొప్పగా ఉంది. బహుళ భాషల్లో విడుదలైన ఈ గీతాన్ని గాయనీ గాయకులు మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల, ఐరా ఉడిపి, మోహన భోగరాజు, వైష్ణవి కన్నన్, సుదీప్‌కుమార్, అరుణ మేరీ ఆలపించారు.

ఈ పాటకు తెలుగులో చంద్రబోస్, తమిళంలో పా విజయ్, మలయాళంలో మంకొంబు గోపాలకృష్ణన్, కన్నడలో వరదరాజ్, హిందీలో అబ్బాస్ టైరేవాలా సాహిత్యం అందించారు. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వీఎస్; కూర్పు: ప్రవీణ్ కేఎల్; సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్; కళా దర్శకుడు: తోట తరణి; నృత్య దర్శకత్వం: బృందా, గణేశ్; స్టంట్స్: శామ్‌కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్‌లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్.